అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ 17 మండలాల పరిధిలో 8.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. శింగనమల 44.4 మి.మీ, ఉరవకొండ 42.6, యల్లనూరు 29.6, నార్పల 21.4, పుట్లూరు 18.4, బుక్కరాయసముద్రం 16.2, అనంతపురం 15.2, రాప్తాడు 14, పెద్దపప్పూరు 12.4, ఆత్మకూరు 10.2 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా..ఇప్పటివరకు 80.5 మి.మీ నమోదైంది. రాగల రెండు రోజులూ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
నేడు, రేపు ‘ఇంటర్ కాలేజ్ ఫెస్ట్–2023’
అనంతపురం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ అండ్ ఒకేషనల్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలోని యువ టూరిజం క్లబ్ ఈ నెల 26, 27 తేదీల్లో ‘ఇంటర్ కాలేజ్ ఫెస్ట్–2023’ నిర్వహించనుంది. యంగ్ మేనేజర్, ట్రెజర్ హంట్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్విజ్ వంటి పోటీలలో అనంతపురం సమీపంలోని కళాశాలల విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా ఈ–పోస్టర్ మేకింగ్ పోటీని ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో విజేతలకు 27న ఆకర్షణీయమైన ప్రైజ్ మనీ అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ రుచులను పరిచయం చేస్తూ వివిధ ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ టూరిజం అథారిటీ సహకారంతో మేనేజ్‌మెంట్ విభాగం సోమవారం వరల్డ్ టూరిజం డే థీమ్ ‘టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్’పై వ్యాసరచన, ప్రసంగాన్ని కూడా నిర్వహించింది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులు కోరారు.
అక్టోబర్ 2 వరకు
‘స్వచ్ఛతా హీ సేవ’
అనంతపురం రూరల్: భారత జలశక్తి హౌసింగ్ అర్బన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో చెత్తను తొలగించడం, గ్రామాలలో చెత్త వేసే ప్రదేశాలను శుభ్రం చేయటం, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్‌లో వాల్‌పెయింట్స్ వేయడం, స్వచ్ఛతపై క్విజ్‌లు, ప్లాంటేషన్ డ్రైవ్‌లు నిర్వహించడం, స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించడంతోపాటు స్వచ్ఛత రన్ నిర్వహిస్తామన్నారు. రెండో తేదీ గాంధీ జయంతిని పురస్కరించిన అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
29 నుంచి రోలర్ స్కేటింగ్ క్రీడాకారుల ఎంపిక
అనంతపురం: త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే రోలర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 29 నుంచి చేపట్టనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా స్కేటింగ్ అదనపు కార్యదర్శి రవిబాబు, జిల్లా స్కేటింగ్ కోచ్ పి. నాగేంద్ర సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29న చిలమత్తూరు మండలం టేకులోడు స్టేక్ బోర్డులో ఎంపికలు ఉంటాయి. అలాగే 30వ తేదీ అనంతపురంలోని మాక్ రోలర్ స్కేటింగ్ అకాడమీలో రింక్ పోటీలు, అక్టోబర్ 1న జేఎన్‌టీయూ (అనంతపురం) క్యాంపస్ కళాశాలలో ఎంపికలు ఉంటాయి. పూర్తి వివరాలకు 94923 27908, 89783 14415లో సంప్రదించవచ్చు.
సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వస్తున్న విద్యార్థులు


