రెచ్చిపోయిన ‘ఈనాడు’ రిపోర్టర్‌ | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ‘ఈనాడు’ రిపోర్టర్‌

Published Mon, Aug 21 2023 1:54 AM

- - Sakshi

రాప్తాడు రూరల్‌: ఈనాడు పత్రికలో పని చేస్తున్న ఓ రిపోర్టర్‌ రెచ్చిపోయాడు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. అడ్డుకోబోయిన ఉద్యోగులను బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే... ఈనాడు పత్రికలో రిపోర్టర్‌గా పని చేసే చంద్రశేఖర్‌ ఆదివారం ఉదయం జేసీబీనీ వెంట పెట్టుకుని సమగ్ర శిక్ష కార్యాలయ ఆవరణలోకి దూసుకెళ్లాడు. ఆవరణలో ఉన్న కొన్ని చెట్లను తొలిగించి ఆ ప్రాంతాన్ని చదును చేయించాడు. సెలవు రోజు కావడంతో ఉద్యోగులెవరూ అక్కడ లేరు. విధుల్లో ఉన్న వాచ్‌మన్‌ శంకర్‌నాయక్‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

ఇదే విషయాన్ని సూపరింటెండెంట్‌ సునీల్‌కు వాచ్‌మెన చేరవేయడంతో వెంటనే ఆయనతో పాటు అసిస్టెంట్‌ సీఎంఓ గోపాలకృష్ణ, ఎంఈఓ గురుప్రసాద్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వారితోనూ చంద్రశేఖర్‌ తీవ్ర స్థాయిలో వాదనకు దిగాడు. ‘ఏయ్‌...నేనంటే ఏమనుకున్నారు... నాపేరు చంద్రశేఖర్‌. 20 ఏళ్లుగా ఈనాడులో రిపోర్టర్‌గా పని చేస్తున్నా. మీరు ఇక్కడ ఈ రోజు ఉంటారు రేపు పోతారు. మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు’ అంటూ హెచ్చరించాడు. ఇది ప్రభుత్వ కార్యాలయమని ఏదైనా ఉంటే డీపీసీ, ఏసీపీతో మాట్లాడాలని సూపరింటెండెంట్‌ చెప్పినా వినకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి గట్టిగా రెచ్చిపోయాడు.

ఉద్యోగులు కూడా తీవ్రస్థాయిలో ప్రతిఘటించడంతో చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై సూపరింటెండెంట్‌ సునీల్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఈనాడు రిపోర్టర్‌ చంద్రశేఖర్‌ దౌర్జన్యంగా వచ్చి కార్యాలయ ఆవరణలోని చెట్లను తొలగించాడన్నారు. తాను అడ్డుకోబోతే బెదిరించాడన్నారు. ప్రభుత్వ కార్యాలయంలోని చెట్లను అక్రమంగా తొలిగించి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement