ప్రేమ పెళ్లి..పదేళ్ల దాంపత్యం: మేమెళ్లిపోతున్నాం.. సంతోషంగా ఉండు!

- - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ప్రేమ పెళ్లి..పదేళ్ల దాంపత్యం..ముత్యాల్లాంటి ఇద్దరి పిల్లలు. ఆ దంపతుల మధ్య ఏమైందో తెలియదు... ఎవరొచ్చారో తెలియదు. అతను తట్టుకోలేకపోయాడు. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బిడ్డలతో కలిసి బుక్కరాయసముద్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘మేమెళ్లిపోతున్నాం.. నువ్వు సంతోషంగా ఉండు’’అని భార్యనుద్దేశించి భర్త రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషాదకర సంఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని రంగస్వామి నగర్‌కు చెందిన బోరింగ్‌ బాషా కుమారుడు మహమ్మద్‌ రఫీ (36), తన నివాసం సమీపంలో ఉంటున్న ఖైరాన్‌ కుమార్తె భానును పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇమ్రాన్‌(9), సోహైల్‌ (6) సంతానం. మహమ్మద్‌ రఫీ బేల్దారీగా పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు.

ఈ కుటుంబం ఎక్కువగా బెంగళూరులో ఉండేది. పండుగలు, పర్వదినాలకు మాత్రం అనంతపురం వచ్చేది. అందులో భాగంగానే 20 రోజుల క్రితం మహమ్మద్‌ రఫీ, భాను పిల్లలతో కలిసి అనంతపురం వచ్చారు. దంపతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, నాలుగురోజుల క్రితం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. మహమ్మద్‌ రఫీ మాత్రం తన మనసులోని బాధను మరచిపోలేక పోయాడు.

పదేపదే తలుచుకుంటూ బాధనంతా భార్యపై చూపించాడు. దీంతో ఆమెకు ఫిట్స్‌ వచ్చాయి. ఈక్రమంలో భార్య తరఫు బంధువులు మహమ్మద్‌ రఫీని బెదిరించారు. తమ బిడ్డకు ఏమైనా అయితే నీదే బాధ్యత అన్నట్లుగా మాట్లాడారు. తప్పుచేసిన వారిని వదిలి తనపై ఎదురుదాడిని జీర్ణించుకోలేని మహమ్మద్‌ రఫీ తన ఇద్దరు కుమారులను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో భార్య భాను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న మూడో పట్టణ పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయాన్నే బుక్కరాయసముద్రం చెరువులో మూడు మృతదేహాలున్నట్లు స్థానికుల సమాచారం తో పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. ఆ మృతదేహాలు అదృశ్యమైన మహమ్మద్‌ రఫీ, ఆయన కుమారులు ఇమ్రాన్‌, సోహైల్‌విగా గుర్తించారు.

భార్య ప్రవర్తనతో జీవితంపై విరక్తి చెందిన మహమ్మద్‌ రఫీ బిడ్డలిద్దరినీ చెరువులో తోసి, ఆ తర్వాత తాను దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ మహమ్మద్‌ రఫీ రాసిన సూసైడ్‌ లేఖను అతని జేబులోని ఓ బాటిల్‌లో ఉండగా స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

రంగస్వామి నగర్‌లో విషాదఛాయలు
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో రంగస్వామి నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. ఏం కష్టమొచ్చిందయ్యా.. వారిని ఎలా బలి తీసుకున్నావంటూ రోదించిన తీరు చూపరులను కలచి వేసింది. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక పసివాళ్లు చేసిన పాపమేందంటూ పలువురు పోలీసులు సైతం కంటతడి పెట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు :

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top