గెజిట్‌పై కొర్రీ... అధికారుల వర్రీ | - | Sakshi
Sakshi News home page

గెజిట్‌పై కొర్రీ... అధికారుల వర్రీ

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

జిల్లాలో ఒక్కో పంచాయతీ హైకోర్టుని ఆశ్రయిస్తున్న వైనం

రిజర్వేషన్ల మార్పుపై ఇప్పటికే అలజడి

పాపయ్యపాలెం, పాపయ్యసంతపాలెం గ్రామాల ఓట్లు రెండు గ్రామాల్లోనూ

ఎస్సీలు లేని కప్పుగొండుపాలెంలో

సర్పంచ్‌ రిజర్వేషన్‌ కేటాయింపు

సాక్షి, అనకాపల్లి : పంచాయతీ ఎన్నికలు పోటీ చేసే నాయకులకే పరీక్ష అనుకుంటాం..! జిల్లాలో మాత్రం అధికారులకు నిరంతర అగ్ని పరీక్ష. దేశంలో ఎంతో పారదర్శకంగా చెప్పుకునే ఎన్నికల వ్యవస్థలో కనిపిస్తున్న లోపాలతో ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తమకు న్యాయం చేయాలంటూ సుమారు ఏడు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం, పిటిషన్‌దారులకు సంతృప్తికరమైన వివరాలు ఇవ్వమని ఉత్తర్వులు రావడంతో జిల్లా అధికారులు పరుగులు తీస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారు. అయితే జిల్లాలో పోటీ చేయకుండా ఒక చోట, ఎన్నికలే నిర్వహించకుండా మరో చోట, పోటీ చేసేందుకే అభ్యర్థులు లేకుండా ఇంకో చోట ప్రజలు ఓడిపోయేలా చేస్తున్నదెవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశం..వివరాల్లోకి వెళితే...

ఎస్సీ ఓటర్లు లేని చోట ఎస్సీ రిజర్వేషన్‌

జిల్లాలోని రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో ఒక్క ఎస్సీ ఓటరూ లేరు. ఇక్కడ రెండు వార్డు స్థానాలతో పాటు, సర్పంచ్‌ స్థానానికి ఎస్సీ రిజర్వేషన్‌ కేటాయించారు. దీంతో అవాక్కయిన స్థానికులు ఎస్సీలే లేని చోట ఎస్సీ రిజర్వేషన్‌ ఏమిటని అధికారులకు తమ గోడు వినిపించారు.అయినా స్పందన లేదు. దీంతో స్థానిక ప్రతినిధి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై పునఃసమీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 16న కొప్పుగొండుపాలెం పంచాయతీకి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది.

ఐదేళ్లుగా తేలని ‘పంచాయతీ’

రాంబిల్లి మండలంలోని నాలుగు గ్రామాలకు పంచాయతీ ఎన్నికలే లేకుండా పోయింది. కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా పంచదార్ల నుంచి అప్పారాయుడిపాలెం, జడ్‌.చింతువ నుంచి ఎం.చింతువ గ్రామాలను వేరు చేసి నాలుగు పంచాయతీలుగా విభజించారు. పంచాయతీల విభజన సహేతుకంగా లేదని స్థానికంగా పలుకుబడి ఉన్న నేత కోర్టుని ఆశ్రయించారు. ఐదేళ్ల నుంచి కోర్టు ఉత్తర్వుల స్పష్టత, పరిష్కారానికి జిల్లా అధికారుల చొరవ లేకపోవడంతో ఈ నాలుగు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి.

ఓటర్ల తకరారు...

అనకాపల్లి మండలంలోని పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం గ్రామాల సమస్య మరీ అన్యాయం. పాపయ్యపాలేనికి చెందిన 366 ఓట్లు పాపయ్యసంతపాలెంలో నమోదయ్యాయి. అదే విధంగా పాపయ్యసంతపాలెం గ్రామానికి చెందిన 398 ఓట్లు పాపయ్యపాలెంలో నమోదయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే పక్క గ్రామానికి వెళ్లాలి. గతంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు గ్రామాలకు ఒకే పోలింగ్‌ బూత్‌ ఉండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే చోట ఓటు వేశారు. ఇప్పుడు రెండు గ్రామాల ప్రజల ఓట్లు కొందరికి ఒక గ్రామంలోనూ, మరికొందరికి ఇంకో గ్రామంలో ఉన్నాయి. పోటీ చేసే అభ్యర్థి రెండు గ్రామాల్లో ప్రచారం చేయాలా..? లేక గెలిచిన చోట ఏ గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలి..? వంటి ఆసక్తికర ప్రశ్నలు స్థానిక ఔత్సాహిక అభ్యర్థులకు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యను సరిదిద్దమని అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన కరువైంది.

గెజిట్‌ మార్పుతో వివాదం

అనకాపల్లి మండలంలోని 13 పంచాయతీలకు సంబంధించి ముందుగా విడుదల చేసిన గెజిట్‌కు రెండవసారి విడుదల చేసిన గెజిట్‌కు వ్యత్యాసం ఉండడం, అకారణంగా రిజర్వేషన్లు మార్చడం వంటి పరిణామాలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. మూడు గ్రామాల ప్రజలకు కోర్టుకెళ్లడం, కోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో చివరకు డీపీఓ ద్వారా రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన మార్చాల్సి వచ్చిందో రాత పూర్వక సమాధానం వచ్చింది. డీపీఓ నుంచి వచ్చిన వివరణపైనా ఫిర్యాదు దారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలను తెరమీదకు తెచ్చి ఉన్నతాఽధికారులు చేతులు దులుపుకొన్నారు. ఓటర్ల వివరాలు నమోదు, రిజర్వేషన్ల అమలు విషయంలో అధికార యంత్రాంగం తప్పిదాలు ఎన్నికల తీరునే ప్రశ్నార్థకం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement