సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనృసింహ దీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఈనెల 23 నుంచి మండల దీక్ష, డిసెంబరు 2 నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 8 గంటలకు సింహగిరిపై దీక్షాదారులకు దేవస్థానం తరఫున మాలధారణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 2న రెండు దీక్షల విరమణ ఉంటుందని తెలిపారు. ఆరోజు ఉదయం 6.30 గంటల నుంచి దీక్షాదారులు తిరుముడి సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జనవరి 1న చేరుకునే దూరప్రాంత భక్తులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని ఈవో వెల్లడించారు.


