రోలుగుంట : ప్రభుత్వ పథకాలు మంజూరుకు ఏ అధికారికి ఒక రూపాయి కూడా ఇవ్వొద్దని, అర్హులందరికీ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మండలంలోని కంచుగుమల గ్రామంలో తొలిసారిగా ప్రభుత్వం చేపట్టిన పేదలకు సేవలు 2.0 కార్యక్రమాన్ని గురువారం ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావు, పలు శాఖల అధికారులతో నిర్వహించారు. ఇక్కడ పాల్గొన్న కలెక్టర్ ఎన్టీర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులు పంపిణీ చేశారు. మానసిక వికలాంగుడు జి.సుకుమార్‌కు రూ.15 వేలు, శారీరక దివ్యాంగుడు ఎస్.సింహాచలంకు రూ.6 వేలు, మరో లబ్ధిదారు ఇ.అప్పారావుకి రూ.4వేలు అందజేశారు. లబ్దిదారులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ తమ శాఖ ద్వారా అంగన్‌వాడీల్లో చిన్నారులకు, గర్శిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న పోషకాహరం, కేంద్రాల్లో చిన్నారుల కోసం తీసుకొంటున్న జాగ్రత్తలు, సేవలు గురించి తెలిపారు. వ్యవసాయాధికారి చిరంజీవి మాట్లాడుతూ రైతుకు కావాల్సిన రకాల వరి విత్తనాలు, ఎరువులు ఖరీఫ్ సీజన్‌లో సరఫరా చేయడం జరిగిందన్నారు. వర్షాలు కురవక రైతుల పరిస్థితి ప్రతికూలంగా ఏర్పడిందన్నారు. ఆ నష్టం కొంతమేర భర్తీ చేయడానికి జనుము, ఉలవలు రాగి విత్తనాలను 80 శాతం రాయితీపై సరఫరా చేసేందుకు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు.
కేజీబీవీని సందర్శించిన జిల్లా కలెక్టర్
రోలుగుంట కేజీబీవీని కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులకు అందుతున్న బోధనాశైలిని పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థినులతో కలసి భోజనం చేశారు. 10వ తరగతి మిషన్ మార్చ్ కోసం ప్రిపరేషన్ ఎలా సాగుతుందని ప్రిన్సిపాల్ ఎన్.తులసిని ఆరా తీశారు.
రోలుగుంట : తమ సమస్యలు పరిష్కారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో అర్ల పంచాయతీ శివారు కొండ శిఖరాగ్రాన ఉన్న గిరిజనులు స్థాఽనిక మండల కార్యాలయాల కూడలి వద్ద గల ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ డోలిమోతతో ప్రదర్శనగా వచ్చారు. స్థానిక కేజీబీవీని సందర్శించి తిరిగి వస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్‌ను కలిశారు. సీపీఎం జిల్లా ప్రతినిధి గిరిజనుల సమస్యలు కలెక్టర్‌కు వివరించారు. అర్ల పంచాయతీ శివారు పీత్రుగెడ్డ, పెదగరువు, లోసింగి తదితర గిరిజన గ్రామాల్లో 65 మంది బడిఈడు పిల్లలున్నా పాఠశాల లేదన్నారు. వీరు రేషన్ కోసం, నిత్యావసర సరుకుల కోసం, అంగన్‌వాడీ పథకాల కోసం కొండ శిఖరాగ్రం నుంచి 13 కిలోమీటర్లు కిందకు రావాల్సి వస్తోందన్నారు. అర్ల నుంచి పీత్రి గెడ్డ గ్రామానికి 6 కిలోమీటర్లు బీటీ రోడ్డు కోసం రూ 4.10 కోట్లు మంజూరు కాగా, వైబీ పట్నం నుంచి లోసింగి, పెదగరువు గ్రామానికి రూ.2.50 కోట్లుతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే రాజు శంకుస్థాపన చేసి వదిలేశారని తెలిపారు. వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయిందన్నారు. రెండు కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారని, పనులు మద్యంతరంగా వదిలేశారని తెలిపారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలిచ్చిన వారందరికీ న్యాయం చేయాలని కోరారు.


