● మార్కెట్‌కు గాంధీజీ పేరు పెడతామంటే మహాత్ముడి చమత్కారం ● అనకాపల్లిలో మహాత్ముని జాడలు ● నాలుగు సార్లు సందర్శన ● నేడు గాంధీ జయంతి | - | Sakshi
Sakshi News home page

● మార్కెట్‌కు గాంధీజీ పేరు పెడతామంటే మహాత్ముడి చమత్కారం ● అనకాపల్లిలో మహాత్ముని జాడలు ● నాలుగు సార్లు సందర్శన ● నేడు గాంధీ జయంతి

Oct 2 2026 12:40 AM | Updated on Oct 2 2026 12:40 AM

● మార్కెట్‌కు గాంధీజీ పేరు పెడతామంటే మహాత్ముడి చమత్కారం ● అనకాపల్లిలో మహాత్ముని జాడలు ● నాలుగు సార్లు సందర్శన ● నేడు గాంధీ జయంతి

గాంధీ సందర్శించిన బెల్లం మార్కెట్‌లో ఆయనకు గుర్తుగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం

అనకాపల్లి టౌన్‌ : స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అనకాపల్లికి ప్రత్యేక స్ధానం ఉంది. అనకాపల్లిని మహాత్మాగాంధీ నాలుగుసార్లు సందర్శించారు. ఇక్కడి వర్తకులు, ప్రజలతో మమేకం అయ్యారు. మెదటిసారిగా స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో 1921 మార్చి 30న బరంపురం నుంచి బెజవాడ వెళుతున్నారని తెలుసుకున్న అనకాపల్లి ప్రజలు రైల్వేస్టేషన్‌కు చేరుకొని గాంధీకి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం గాంధీజీ రెండు నిమిషాలు హిందీలో ప్రసంగించారు. తిలక్‌ స్వరాజ్య నిధికి సేకరించిన విరాళాలు కోరుకొండ బుచ్చిరాజు, పెద్ది నూకయ్యశెట్టి తదితరులు అందజేశారు.

ఖద్దరు నిధి వసూళ్లకు...

తర్వాత 1929 మే 1న మహాత్మాగాంధీ ఖద్దరు నిధి వసూళ్ల నిమిత్తం చోడవరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న తరువాత అనకాపల్లి చేరుకున్నారు. ఇప్పటి కాయగూరల మార్కెట్‌ అప్పటి బెల్లం మార్కెట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు భారీ స్ధాయిలో ప్రజలు హాజరయ్యారు. ఇక్కడి బెల్లం మార్కెట్‌లో ప్రసంగించారు. ఈ సభలోనే ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడి మార్కెట్‌ కు తమ పేరు పెట్టుకుంటామని గాంధీని ఇక్కడి వర్తకులు, రైతులు కోరగా..తన పేరు పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, ఇక్కడ బెల్లం మాత్రమే అమ్మాలని..మద్యం అమ్మవద్దని చమత్కరించారు. సభకు వచ్చిన రైతులు, వర్తకులు విరాళాలు ఇవ్వగా, పలువురు మహిళలు తమ బంగారు వస్తువులను స్వచ్చందంగా అందజేసినట్లు కొందరు చెబుతుంటారు.

బహిరంగ సభలో...

ఇక మూడవసారి గాంధీజీ 1933లో అనకాపల్లి సందర్శించారు. విజయనగరం మహారాజా అలక్‌ నారాయణ గజపతికి చెందిన రోల్స్‌రాయిస్‌ కారులో ఉదయం అనకాపల్లి చేరుకొని స్థానిక నెహ్రుచౌక్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న అప్పటి గ్రంధి హనుమంతరావు ఎస్టేట్‌లో మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకొన్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ తమ్మన గంగరాజు శెట్టి, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణ మూర్తి, కోరుకొండ లింగమూర్తి గాంఽధీజీని వేదికపై ఆహ్వానించారు. సభలో గాంధీజీ హరిజనోద్దరణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

రైలులో వచ్చి..మౌనవ్రతం

చివరిసారిగా గాంధీజీ 1946లో ప్రత్యేక రైలులో అనకాపల్లి వచ్చారు. అప్పటి ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు టంగుటూరి ప్రకాశం పంతులు గాంధీజీకి సాదరంగా స్వాగతం పలికారు. రైల్వేప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు. అయితే సభికులు గోల చేయడంతో గాంఽధీజీ మౌనవ్రతం పాటించారు. గాంధీజీ ప్రసంగాలకు స్ఫూర్తి పొందిన బెల్లం వర్తకులు కోరుకొండ బుచ్చిరాజు కుమారుడు సుబ్బరాజు, మరికొంత మంది క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement