సాక్షి, అనకాపల్లి: ఈ రెండేళ్లలో నిరుద్యోగుల కలలు కరిగిపోయాయి. విద్య, వైద్య రంగాలు భ్రష్టుపట్టాయి. నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారింది. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు టోపీ పెట్టారు. జిల్లాలోని అర్హులైన ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు గాని, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాకు ప్రభుత్వ పథకాల ప్రచారం పేరిట రూ.కోట్ల నిధు లు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు ‘సోషల్ మీడియా పాలసీ’ తీసుకురావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీపీకి లబ్ధి కోసమే...
ఐటీడీపీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీరుపై రైతులు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఇలా అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీడీపీకి చెందిన సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీరందరికీ ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఈ కొత్త పాలసీకి ఆమోదం తెలిపిందని పలువురు ఆరోపిస్తున్నారు.
కరువు కోరల్లో అన్నదాతలు
ఎల్ నినో ప్రభావం గురించి చాలా కాలం ముందే శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ‘ఎలో’్ల నినో కారణంగా అన్నదాతలు కరువు కోరల్లో చిక్కుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ వరి సాగు విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 శాతం వరి నాట్లు కూడా వేయలేదు. నాట్లు వేసిన ప్రాంతాల్లో నీరందక పంట ఎండిపోయింది. దీంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం అటువైపు దృష్టి సారించకుండా, కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమానికి దిక్కు లేదు గానీ..!
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్న హామీతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏదో ఒక సాకుతో వాటిని గాలికి వదిలేసింది. బడ్జెట్ లేదని, పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ప్రచారానికి తెరలేపింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛను వంటి పథకాలను అమలు చేసేందుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, కొత్త పాలసీకి ఎక్కడి నుంచి నిధులు తెస్తుందనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.
వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపైనా
విషప్రచారం చేసి..
గత ప్రభుత్వ హయాంలో వలంటీర్ వ్యవస్థ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసి, పథకాల అమలులో ఎంతో కృషి చేసింది. వలంటీర్లకు ఇచ్చిన గౌరవ వేతనంపై దుష్ప్రచారం చేసిన ప్రతిపక్ష నేతలు, ఇప్పుడు ఈ దుబారా పాలసీ గురించి ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారో అర్థం కావడం లేదనే వాదన వ్యక్తమవుతోంది. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాల లోపం, కర్మాగారాల మూత, ప్రధాన నగరాల్లో తాగునీటి ఎద్దడి, నిరుద్యోగం వంటి సమస్యలను పక్కన పెట్టిన ప్రభుత్వం, కేవలం డప్పు కొట్టుకునే పాలసీలు తేవడమేంటని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రచార డప్పుకు..
ప్రజా డబ్బు
ఐటీడీపీ సభ్యులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే పథకం
ప్రజాధనం దోపిడీకి మరో వ్యూహం
ప్రజల దృష్టిని మరల్చడానికే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇది విచిత్రపాలసీ
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ అందిస్తానని చంద్రబాబు చెప్పారు. దీనితో పా టు 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి సుమారు 30 నెలలు పూర్తవుతున్నా హామీలు అమలు చేయలేదు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు విచి త్ర పాలసీని తీసుకొచ్చారు. – బండారు దేముళ్లు,
మాజీ సర్పంచ్,గుల్లేపల్లి,కె.కోటపాడు మండలం
డప్పు కొట్టడానికి వేతనాలా?
గతంలో వలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేసి రూ.5 వేలు వేతనం తీసుకుంటే దుబారా చేస్తున్నారని నానా యాగీ చేశారు. వలంటీర్లు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా సహకరించారే తప్ప, ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. కానీ ఇప్పుడు కేవలం డప్పు కొట్టుకోవడానికి ఫాలోవర్స్‌ను బట్టి వేతనాలు ఇస్తారా..? ఇది కేవలం ప్రజల్ని పక్కదోవ పట్టించడమే. – రాజాన బుజ్జి, అధ్యక్షుడు,
అంబేడ్కరిజం పునాది అసోసియేషన్
ఇది దుబారా పాలసీ
సంక్షేమ పథకాల అమలు తీరు బాగుంటే ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే గుర్తిస్తారు. ఎవడి డప్పు వాడు కొట్టుకోకూడదు. ఇది పూర్తిగా దుబారా పథకం. ఇప్పటికే బడ్జెట్ లేదని హామీలు నెరవేర్చడం లేదు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్కడ అమలవుతున్నాయి?
–కె.జగన్, మాజీ ఉప సర్పంచ్,
తిమ్మరాజుపేట


