అనకాపల్లిటౌన్: పట్టణ నడిబొడ్డున, జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల, బండారు సత్యనారాయ ణ మూర్తి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యలపై చర్చించేందుకు సమయం తక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా పరిషత్ ఏర్పడడంతో సమస్యలపై విపులంగా చర్చించే అవకాశం ఉంటుందన్నారు. నిధులన్నీ పూర్తిగా అనకాపల్లి జిల్లాలోని అభివృద్ధి పనులకే ఖర్చు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు విశాఖపట్నం వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అనకాపల్లిలోనే జిల్లా పరిషత్ కార్యాలయం రావడం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, డిప్యూటీ సీఈవో ఇ సందీప్, డీపీవో మంజులవాణి, అనకాపల్లి ఎంపీడీవో ఆశాజ్యోతి, జోనల్ కమిషనర్ కె. చక్రవర్తి పాల్గొన్నారు.
జారి కింద పడిన కలెక్టర్
పట్టణ జీవీఎంసీ కార్యాలయాన్ని, పక్కనే ఉన్న డంపింగ్ యార్డు, ట్రెజరీ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా డంపింగ్ యార్డు స్థలం పరిశీలించేందుకు వెళుతున్న సమయంలో బురదలో కాలు జారి కలెక్టర్ కింద పడిపోయారు. ఆమె ధరించిన చీరకు బురదఅంటుకున్నా అలాగే ట్రెజరీ, ఎమ్మార్వో కార్యాలయాల భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలాలు అభివృద్ధికినోచుకోకపోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ వృథాగా ఉన్న స్థలాల విస్తీర్ణం ఎంత, తదితర వివరాలు తెలుసుకుని, ఈ స్థలాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా వ ప్రణాళిక రూపొందించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.


