స్టీల్‌ప్లాంట్‌ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

నక్కపల్లి: జాతీయ రహదారి నుంచి కాగితం మీదుగా అమలాపురం వద్ద ఆర్సెలర్‌మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం బయటపడింది. రూ.24 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు కాగితం సమీపంలో సగానికి పైగా కోతకు గురైంది.

స్టీల్‌ ప్లాంట్‌ రవాణా అవసరాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకే భూములు సేకరించి, 80 అడుగుల వెడల్పుతో సుమారు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ డబుల్‌ రోడ్డులో నాసిరకం మెటీరియల్‌ వాడటం వల్లే చిన్నపాటి వర్షానికే కోతకు గురైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే... నక్కపల్లి మండల పరిధిలోని చందనాడ, వేంపాడు, అమలాపురం, మూలపర, డి.ఎల్‌.పురం తదితర గ్రామాల పరిధిలో సుమారు 2,200 ఎకరాలు సేకరించి, రూ.35 వేల కోట్ల వ్యయంతో ‘ఆర్సెలర్‌మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌’ వారు స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన భూమిపూజ కూడా ఇప్పటికే పూర్తయింది. మరోవైపు రాజయ్యపేట, బోయపాడు, బుచ్చిరాజుపేట, చందనాడ గ్రామాల పరిధిలో మరో 2,000 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ నిర్మిస్తున్నారు. ఈ రెండు పరిశ్రమలకు రవాణా సదుపాయం కల్పించేందుకు, జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్ల వ్యయంతో రహదారులు–భవనాల శాఖ ఆధ్వర్యంలో డబుల్‌ లైన్‌ రోడ్డును నిర్మిస్తోంది. ఈ రోడ్డు కోసం కాగితం, వేంపాడు, చందనాడ తదితర గ్రామాల పరిధిలో సుమారు 60 ఎకరాలు సేకరించారు. అందులో దాదాపు 30 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.

అయితే, ఈ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే నాణ్యతా లోపం బయటపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి ఈ రోడ్డు నిర్మాణం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇరువైపులా పొలాలు కలిగిన రైతులకు అనువుగా రోడ్డు మధ్యలో డివైడర్ల వద్ద రోడ్డు దాటే మార్గం ఇవ్వకపోవడం, ప్రతీ 200 మీటర్లకు ఇవ్వాల్సిన మార్గాన్ని 500 మీటర్ల దూరంలో ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. దీనివల్ల పొలాల్లోకి వెళ్లే రైతులకు, పశువులను మేపుకొనే పాడి రైతులకు రాకపోకల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు పనులు నిలిపివేయాలని గతంలో ఆందోళనలు కూడా చేశారు. ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్‌ రోడ్డు నిర్మించే సమయంలో ఇరువైపులా వర్షపు నీరు ప్రవహించే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు దిగువ భూముల గుండా సముద్రంలోకి కలిసేందుకు సరైన మార్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, గతంలో ఉన్న తూములు, కల్వర్టులను ఇష్టానుసారంగా మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు స్టీల్‌ప్లాంట్‌ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. దీనివల్ల ఇరువైపులా ఉన్న వరి పొలాలు ముంపు బారిన పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భూమట్టానికి దాదాపు 10 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మట్టి, గ్రావెల్‌, క్రషర్‌ వేసి ఎత్తు చేసి దానిపై తారు రోడ్డు వేస్తున్నారు. ఈ పనుల్లో ఆర్‌అండ్‌ బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే నాసిరకం మెటీరియల్‌ వాడారని, ఫలితంగానే రోడ్డు కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు దాదాపు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిప్స్‌ క్రషర్‌ బూడిద వేసి రోడ్డు సిద్ధం చేశారు. ఇక తారు వేయాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు సగానికి పైగా కొట్టుకుపోయింది. ఇరువైపులా అప్రోచ్‌ బెర్ముల కోసం వేసిన మట్టి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. నిర్మాణ దశలోనే ఇలా ఉంటే, పనులు పూర్తయ్యాక భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఈ రోడ్డుపై స్టీల్‌ ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లకు చెందిన భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి ఎంతో పటిష్టంగా రోడ్డు నిర్మించాల్సిన ఆర్‌అండ్‌ బీ అధికారులు కమీషన్ల కక్కుర్తితో పనుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నాణ్యతను గాలికి వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించాలని, అలాగే రోడ్డుకు ఇరువైపులా గతంలో ఉన్న కల్వర్టులు, తూములను పునరుద్ధరించాలని రైతులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నీరు వెళ్లే మార్గాలు మూసివేయడంతో పొలాల్లో నిలిచిన వర్షం నీరు

కాగితం సమీపంలో కోతకు గురైన స్టీల్‌ప్లాంట్‌ రోడ్డు

రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించింది

రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్న నీరు వెళ్లే మార్గాలు, కల్వర్టులు, తూములను తొలగించి తమ ఇష్టానుసారంగా కొత్తవి నిర్మించడం వల్లే రోడ్డుకు ఇరువైపులా భారీగా నీరు చేరి రోడ్డు కోతకు గురైంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటి వల్ల రోడ్డు మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా, ఇరువైపులా ఉన్న పొలాలు, నివాస ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్‌ రికార్డులను పరిశీలించి పూర్వం ఉన్న కాలువలు, తూములు, కల్వర్టులను వెంటనే పునరుద్ధరించాలి. – పోతంశెట్టి బాబ్జి, రైతు,కాగిత

చిన్నపాటి వర్షానికే కోతకు గురైన రహదారి

అధికారుల నిర్లక్ష్యంతో కాలువలు, తూముల మూసివేత

భవిష్యత్తులో ముంపు తప్పదని రైతుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement