తీరంలో అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తీరంలో అలర్ట్‌

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో రోజంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు వర్షానికి నీటితో మునిగిపోయాయి. మంగళవారం సబ్బవరం మండలంలో అత్యధికంగా 64.4 మి.మీ వర్షపాతం నమోదవగా, పాయకరావుపేట మండలంలో అత్యల్పంగా 17.6 మి.మీ నమోదైంది. –అనకాపల్లి

తుపాను ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. రోడ్లపై వర్షపునీరు పొంగి ప్రవహించింది. బీఎన్‌రోడ్డుతో పాటు పలు గ్రామాల్లో గోతులమయమైన రోడ్లలో నీరు చేరి రాకపోకలకు జనం తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు తుపాను వర్షాలకు పొలాల్లో నీరు చేరింది. వానల్లేక అల్లాడుతున్న వరి పొలాలు దమ్ములు పట్టి నాట్లు వేసేందుకు అనుకూలంగా మారాయి. మాకవరపాలెంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో రెండు గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా జిల్లా అధికారులు తీర ప్రాంతంలో అలర్ట్‌ ప్రకటించారు. మత్స్యకారులను చేపలవేటకు వెల్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ఉధృతమైతే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

నేడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల కారణంగా ఈనెల 23న జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, పలుచోట్ల భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్ధితుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులకు గురి కాకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని కలెక్టర్‌ తెలిపారు.

పూడిమడక తీరంలో అప్రమత్తం

అచ్యుతాపురం రూరల్‌ : పూడిమడక సముద్ర తీరంలో మంగళవారం తుపాను ప్రభావం ప్రస్తుతం అవుట్‌ ఆఫ్‌ డేంజర్‌ అని తహసీల్దార్‌ డి.శ్రీను తెలిపారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రత్యేక అధికారి యశ్వంత్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారన్నారు. అలాగే తీర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశామని, తుఫాన్‌ ప్రభావం తీవ్రతరం అయితే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

మాడుగుల మండలం పెద్దేరు ఆయకట్టులో చేరిన వర్షపు నీరు

మాకవరపాలెం– పీపీ అగ్రహారం మార్గంలో కూలిన చెట్టు

జిల్లాలో వివిధ మండలాల్లో మంగళవారం వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement