ఐదేళ్లలో ఎంతో సాధించాం : జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
భావోద్వేగాల నడుమ ఆఖరి సర్వసభ్య సమావేశం
హాజరైన ఎంపీ బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే బండారు
ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చ
సభ్యులకు ఘన సత్కారం, జ్ఞాపికల బహూకరణ
సాక్షి, విశాఖపట్నం : భావోద్వేగాల నడుమ ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆఖరి రోజు జరిగింది. మంగళవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, గ్రామీణాభివద్ధి, సంక్షేమం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. వైద్యసేవలను విస్తృతం చేయాలని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంత వరకు అంబులెన్స్ సేవలను విస్తరించాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా అందించనున్న పింఛన్ల మంజూరు విషయంలో, సదరం సర్టిఫికెట్ల జారీలో అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళలకు అందించే పింఛన్ల విషయంలోనూ నిబంధనలు సడలించాలన్నారు.
పింఛన్లపై వాడీవేడి చర్చ
సభలో పింఛన్లపై వాడీవేడిగా చర్చ జరిగింది. విడో పింఛన్లు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లు, సదరం సర్టిఫికెట్లలో సమన్యాయం లేకపోవడంపై సభ్యులు అభ్యతరం వ్యక్తం చేశారు. శిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా పింఛన్లు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల కోసం దరఖాస్తుకు తొలుత వారం రోజులు గడువు ఇచ్చినా అందులో మూడు రోజులు సెలువులు పోగా మరో రెండు రోజులు గడువు పెంచారన్నారు. ఎన్నికల ముందు 50 ఏళ్ల మహిళలకు వృద్ధాప్య పింఛను అన్నారని, కానీ ఇప్పుడు పింఛన్ల దరఖాస్తు చేసుకునేందుకే ఆంక్షలు పెడితే అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. విడో పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆంక్షలు ఎక్కువ పెట్టారంటూ అనురాధ తెలిపారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని సభ్యులు కూడా డిమాండ్ చేశారు.
నిధుల విడుదలకు తీర్మానాలు
2021–2026 సెప్టెంబర్ 24 వరకూ కొలువుతీరిన కార్యవర్గంలో జెడ్పీటీసీలకు గౌరవ వేతనం పెండింగ్‌లో ఉందని, జెడ్పీ జనరల్ ఫండ్ నుంచైనా వాటిని మంజూరు చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేయగా జెడ్పీ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీ సభ్యుల 18 నెలల గౌరవ వేతనం రూ.66 లక్షలు ఇవ్వాలని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పెండింగ్‌లో ఉన్న 15వ ప్లానింగ్ కమిషన్ చివరి క్వార్టర్లీ నిధులు రూ.2.82 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాలని తీర్మానం చేశారు.
ఉమ్మడి జిల్లా ఆస్తుల్లో సమన్యాయం
జిల్లా పరిషత్ విభజన అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సమన్యాయం జరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని చైర్‌పర్సన్, సీఈవోలను ఎమ్మెల్యే కోరారు. ఏజెన్సీ ప్రాంతాలు, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఆస్తులు పంపిణీ చేసే సమయంలో జనాభా ప్రాతిపదికన, ఉద్యోగుల కేటాయింపు తరహాలో మూడు జిల్లాలకు న్యాయమైన వాటా కల్పించాలని కోరారు.
భావోద్వేగాల నడుమ సత్కార కార్యక్రమాలు
జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రను రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ, ఇతర సభ్యులు శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు, పలువురు ఎంపీపీలకు అతిథుల చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ క్రమంలో సభ్యులు భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు చేశారు. అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
జగనన్నకు రుణపడి ఉంటా: చైర్‌పర్సన్ సుభద్ర
ఎక్కడో వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో జన్మించిన తనకు రాజకీయంగా ఐదేళ్లపాటు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర అన్నారు. చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో సంతృప్తిని, మధురమైన అనుభూతిని కలిగించిందన్నారు. జిల్లాలు విడిపోయినా ప్రజాసేవ విషయంలో మనమంతా కలిసే ఉంటామన్నారు. ఇక్కడ ప్రస్తావించిన సమస్యలు, అంశాలు చట్టసభల్లో కూడా చర్చకు వచ్చాయని, చాలా వాటికి పరిష్కారం లభించిందన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో తనకు సహకరించిన జెడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీరాజ్ వ్యవస్థే రాజకీయ
ప్రస్థానానికి పునాది: గొల్ల బాబూరావు
పంచాయతీరాజ్ వ్యవస్థ రాజకీయ ప్రస్థానానికి పునాది వంటిదని, ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు కావాలంటే పంచాయతీరాజ్ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి జిల్లా పరిషత్ పునాది అని, ఇక్కడ పనిచేసిన అనుభవం వల్లే ప్రజాజీవితంలో రాజకీయంగా పలు పదవుల్లో ఎదిగే అవకాశం లభించిందన్నారు.
ప్రజల విశ్వాసమే
అసలైన గుర్తింపు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే ప్రజాప్రతినిధుల అసలైన విజయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చైర్‌పర్సన్, సభ్యులు అందించిన సేవలను అభినందించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు వంటి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులందరూ బాధ్యతాయుతంగా పనిచేశారని పేర్కొన్నారు.
జెడ్పీతో నాలుగు దశాబ్దాల
అనుబంధం : ఎమ్మెల్యే బండారు
మండల ప్రెసిడెంట్‌గా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌తో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. చైర్‌పర్సన్ సుభద్ర నాయకత్వంలో సమస్యలను పార్టీలకు అతీతంగా చర్చించి పరిష్కరించుకోగలిగామని, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సమగ్రంగా చర్చిస్తూ ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా సభను నిర్వహించారంటూ అభినందించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర దంపతులను సత్కరిస్తున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి ,ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, సభకు హాజరైన సభ్యులు
కళ్లలో సంతృప్తి.. గుండెల్లో వీడ్కోలు బాధ.. ఈ రెండు భావాల మధ్య మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాల విభజనతో మూడు ముక్కలైన ఉమ్మడి విశాఖను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ చివరి భేటీ, కేవలం ఒక పరిపాలనా తంతుగా కాక భావోద్వేగాల సంగమంగా మారింది. పింఛన్ల మంజూరు మొదలు వైద్య సేవల విస్తరణ దాకా ప్రజా సమస్యలపై వాడీవేడి చర్చలు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు ఐదేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర గొంతు వణికింది. ‘జిల్లాలు విడిపోయినా ప్రజాసేవలో మాత్రం మనమంతా కలిసే ఉంటాం’ అంటూ ఆమె పలికిన మాటలు సభాస్థలిని కంటతడి పెట్టించాయి. –సాక్షి, విశాఖపట్నం


