హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరీబాబా సమాధిని దర్శించుకుంటున్న ముస్లింలు
కశింకోట: కశింకోటలోని హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరీ బాబా దర్గా ఉరుసు షరీఫ్ (చందనోత్సవం) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవం ప్రారంభం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా తరలి వచ్చారు. ఖాదరి బాబా సమాధిపై చాదరులు కప్పి చందనం, సుగంధ ద్రవ్యాలు పూసి పూలతో పూజించి ప్రసాదం సమర్పించి ప్రార్థించారు. ప్రధానమైన ఉరుసు షరీఫ్ బుధవారం జరగనుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం రాత్రి ఫాతెహ(ఆరాధన) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనంలో అందించే ఆహార పదార్థాలను బాబాకు ముస్లింలు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు నివేదించి ప్రార్థనలు చేశారు. అనంతరం సమారాధన చేశారు.
రోడ్డు పనులకు సీఎస్‌ఆర్ నిధులు
అనకాపల్లి : అనకాపల్లి ఆర్‌అండ్‌బీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పర్యవేక్షణలో బివిఎస్‌ఆర్ కనస్ట్రక్షన్ ప్రేవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన రహదారి నిర్మాణ, మరమ్మతు పనులకు కార్పొరేట్ సామా జిక బాధ్యత కింద రూ.39.99 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యలమంచిలి – గాజువాక రోడ్డులోని మడుతూరు గ్రామం మీదుగా ఏపీఐఐసీని కలిపే కనెక్టింగ్ రోడ్డు నిర్మాణం, కొండకర్ల మీదుగా హరిపాలెం–మడుతూరు రోడ్డు (పిఆర్ రీచ్) మరమ్మతు పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రాధాన్య ప్రాతిపదికన చేపట్టిన ఈ పనులకు జీఎస్టీ, సీనరేజ్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 39,99,078 మంజూరు చేసినట్టు తెలిపారు.


