నేరాల నియంత్రణ, రహదారి భద్రతకు గట్టి చర్యలు
మహిళల రక్షణకు ప్రాధాన్యం
నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా
57 మంది పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు
అనకాపల్లి : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో రాజీపడే ప్రసక్తిలేదని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత విషయంలో ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రహదారి భద్రత – డ్రంక్ అండ్ డ్రైవ్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల శాతం పెంచాలని, హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. గుర్తించిన బ్లాక్ స్పాట్స్, ప్రమాద ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రాత్రి గస్తీని పెంచాలని, బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్స్, తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు నియంత్రణకు రాత్రిపూట గస్తీ, బీట్ పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని ఎస్సీ ఆదేశించారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మహిళలకు రక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, విపత్తు నిర్వహణ విభాగం, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల రక్షణకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పురోగతి సాధించిన 57 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఇ.శ్రీనివాసులు, పోతిరెడ్డి శ్రీనివాసరావు, బి.మోహన్‌రావు, కె.రవికుమార్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కశింకోట పోలీసు స్టేషన్ పరిధిలో 17 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి, ఆరుగురు నిందితులను అరెస్టు చేసినందుకు సీఐ అల్లు స్వామినాయుడు, సిబ్బందిని ఎస్పీ తుహీన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.


