28న గోవాడ సుగర్స్‌ మహాజన సభ | - | Sakshi
Sakshi News home page

28న గోవాడ సుగర్స్‌ మహాజన సభ

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ● మాజీ మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడి

చోడవరం : గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలిదీసేందుకు ఈనెల 28వ తేదీన ఫ్యాక్టరీ మహాజన సభను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌ ప్రకటించారు. 24వేల మంది సభ్య రైతులకు, కార్మికులకు సుమారు రూ.30కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లింపులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు విఫలమయ్యారని, చెరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను, కార్మికులను మోసం చేశారని అమర్‌నాఽథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ స్థాపించిన ఈ 64 యేళ్లలో ఏ ఏడాది కూడా మహాజనసభ నిర్వహించకుండా లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతేడాది, ఈ ఏడాది కూడా ఫ్యాక్టరీ మహాజనసభను నిర్వహించలేదన్నారు. మహాజనసభ పెట్టి రైతుల ఆవేదనను తెలుసుకోవాల్సిన పాలకులు పూర్తిగా రైతులను విస్మరించారన్నారు. రెండేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోగా గతేడాది క్రషింగ్‌ కూడా చేయకుండా ఫ్యాక్టరీని మూసేశారని, ఈ ఏడాది కూడా క్రషింగ్‌ చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అందుకే రైతుల ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చెరకు రైతుల మహాజన సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మహాజన సభపై ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఇప్పటికే ఆల్టిమేటం ఇచ్చామని, అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో చివరకు రైతుల పక్షాన నిలబడేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందన్నారు. దివంగత మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో చెరకు ఆశించిన మేర గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు ఫ్యాక్టరీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తర్వాత ఆయన తనయుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.90 కోట్లు తెచ్చి గోవాడ చెరకు రైతులను, ఫ్యాక్టరీకి అండగా నిలిచామన్నారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసి, చివరికి ఫ్యాక్టరీని మూసేసి, చెరకు పంట వేయకుండా రైతుల జీవనాధారాన్ని దెబ్బతీశారని అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. మొదటినుంచి రైతుల పక్షాన ఉంటూ, ఎప్పటికప్పుడు రైతులను ఆదుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు కూడా చెరకు రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈనెల 28వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3గంటలకు గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ ఆవరణంలో చెరకు రైతులతో మహాజన సభను నిర్వహిస్తున్నామన్నారు. రైతులంతా హాజరై సమస్యను ప్రభుత్వానికి వినిపించేలా నినదించాలని అమర్‌నాఽథ్‌ పిలుపు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement