ప్రత్యేక శిబిరాలు వెలవెల | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక శిబిరాలు వెలవెల

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

ఖాళీగా దర్శనమిచ్చిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు అనకాపల్లిలో తెరవని పోలింగ్‌ కేంద్రం యలమంచిలిలో ప్రత్యేక శిబిరాలకు కొందరు బీఎల్వోలు డుమ్మా ప్రచారం లేక కరువైన స్పందన

యలమంచిలి రూరల్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా యలమంచిలి పట్టణం, రాంబిల్లి, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణ శిబిరాలు వెలవెలబోయాయి. గత నెల 22 ,23, 29, 30 తేదీలతో పాటు ఈ నెల 5,6 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిబిరానికి బీఎల్వో డుమ్మా కొట్టడంతో అక్కడకు వచ్చిన కొందరు వెనుదిరిగారు. మధాహ్నం 12 గంటల సమయంలో ఆ పోలింగ్‌ కేంద్రాన్ని ‘సాక్షి’ పరిశీలించగా అక్కడ బీఎల్వో ఉదయం నుంచి విధులకు రాలేదని స్థానిక సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత బీఎల్వోకు ఫోన్‌ చేస్తే పొంతన లేని సమాధానం ఇచ్చారు. కొద్దిసేపటికి ఒక సూపర్‌వైజర్‌ అక్కడకు వచ్చారు. ఇదే విధంగా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాలకు బీఎల్వోలు విధులకు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి బీఎల్వోలు రాకపోవడం, విధులకు హాజరైన వారిలో కొందరు బీఎల్వోలు మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయారు. చాలా చోట్ల కేంద్రాలను సాయంత్రం వరకు తెరవలేదు. దీంతో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రజలు,ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు.

ప్రచారం లేక స్పందన కరవు

పోలింగ్‌ కేంద్రాల వద్ద సర్‌ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు, తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి సరైన ప్రచారం చేపట్టకపోవడంతో ప్రజల నుంచి స్పందన కరువైందన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రచారం లేని కారణంగా ప్రజలు,ఓటర్లు కూడా ప్రత్యేక శిబిరాలను పెద్దగా ఉపయోగించుకోలేకపోయినట్టు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల బీఎల్వోలు మాత్రమే హాజరు కాగా ప్రజలెవరూ పోలింగ్‌ కేంద్రాలకు రాలేదని స్థానికులు తెలిపారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి ఆదివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో మొత్తం 86 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్తగా ఓటు హక్కు కోసం 47, తొలగింపులు 4,తప్పుల సవరణ,బదిలీలకు సంబంధించి 35 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

తెరవని పోలింగ్‌ కేంద్రం

తుమ్మపాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 5,6 తేదీల్లో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఫారం–6,7,8 దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. ప్రత్యేక శిబిరాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం సైతం బీఎల్‌వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు బీఎల్‌వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు, కేంద్రాలకు తాళాలు వేసి ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల కోసం వచ్చిన పలువురు ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. ఎన్నికల సంఘం ఆదేశాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాల్సిన బీఎల్‌వోలు విధులకు హాజరుకాకపోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement