విద్యార్థులకు ‘సంఖ్య’ గోల్డెన్‌ ఛాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ‘సంఖ్య’ గోల్డెన్‌ ఛాన్స్‌

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉచిత చిప్‌ డిజైన్‌ టూల్స్‌

2 వేల మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ

‘పరికల్పక్‌’ మొదటి దశను ప్రారంభించిన సంఖ్య టెక్నాలజీస్‌

తొలిదశలో 4 విద్యా సంస్థల నమోదు

వీఎల్‌ఎస్‌ఐ కోర్సులు చేసే విద్యార్థులకు అవకాశం

సాక్షి, విశాఖపట్నం: సెమీకండక్టర్‌ రంగంలో అడుగుపెట్టాలని ఉత్సాహం చూపే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విశాఖకు చెందిన ప్రముఖ సిస్టమ్‌ డిజైన్‌ ఆటోమేషన్‌ సంస్థ ‘సంఖ్య టెక్నాలజీస్‌’ ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రొఫెషనల్‌ గ్రేడ్‌ చిప్‌ డిజైన్‌ టూల్స్‌ను విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ‘ఎస్‌సీసీఐ సెమీకండక్టర్‌ డిజైన్‌– పరికల్పక్‌’ పేరుతో ఉచిత చిప్‌ రూపకల్పన సాధన ప్రోగ్రామ్‌ మొదటి దశను విజయవంతంగా ప్రారంభించింది. ఇందుకోసం తొలి దశలో 4 విద్యా సంస్థలు నమోదు చేసుకోగా.. 2 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని సంస్థ ప్రకటించింది.

ఇటీవల కాలంలో సెమీకండక్టర్‌ చిప్‌ డిజైన్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా అనేక యూనివర్సిటీలు తక్కువ ఖర్చుతో సెమీకండక్టర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. కేవలం ఓపెన్‌ సోర్స్‌ టూల్స్‌ను ఉపయోగించి సమగ్రమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం సులువు కాదు. అందుకే.. ఈ లోటును భర్తీ చేసేందుకు సాంఖ్య టెక్నాలజీస్‌.. టూల్స్‌ పార్టనర్‌గా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా.. భారతీయ యూనివర్సిటీలకు ‘సంఖ్య టెరాప్టర్‌ డిజైనర్‌–2026 స్టూడెంట్‌ ఎడిషన్‌ అకడమిక్‌ లైసెన్స్‌లను అందిస్తోంది.

తొలి విడతలో 2 వేల మందికి..

ఈ ఉచిత చిప్‌ రూపకల్పన సాధన ప్రోగ్రామ్‌ తొలి దశలో ఇప్పటికే నాలుగు విద్యా సంస్థలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. దీని ద్వారా సుమారు 2,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని సంస్థ అంచనా వేస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్లాట్‌ఫారమ్‌. ఇందులో సంఖ్య టెక్నాలజీస్‌కు చెందిన సొంత టూల్స్‌తో పాటు, ఇండస్ట్రీ–స్టాండర్డ్‌ థర్డ్‌ పార్టీ టూల్స్‌, ఓపెన్‌ సోర్స్‌ టూల్స్‌ కూడా అనుసంధానించి ఉంటాయి. ముఖ్యంగా వీఎల్‌సీసీ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఈ చిప్‌ ఎంతో ఉపయుక్తం కానుంది.

5 యూఎస్‌ పేటెంట్లు మంజూరు..

సంఖ్య టెక్నాలజీస్‌ 1996లో చైన్నెలో ఒక గ్యారేజ్‌ స్టార్టప్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె, విశాఖపట్నంలలో డెవలప్‌మెంట్‌ కేంద్రాలతో ప్రాసెసర్‌ డిజైన్‌ ఆటోమేషన్‌లో గ్లోబల్‌ టెక్నాలజీ లీడర్‌గా ఎదిగింది. ఈ సంస్థకు ఇప్పటికే 5 యూఎస్‌ పేటెంట్లు మంజూరయ్యాయి. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఎస్‌సీసీఐ అనేది 2011లో లాభాపేక్ష లేని సంస్థగా గ్రావిటీ 2.0 రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో స్వయంప్రతిపత్తి (అటానమస్‌) విభాగంగా ఏర్పాటు చేశారు. సృజనాత్మక ఆలోచనలు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అధునాతన టూల్స్‌ను అందించే ఎకోసిస్టమ్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement