అత్యవసర సేవలూ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

అత్యవసర సేవలూ బంద్‌

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

● కేజీహెచ్‌లో విలవిలలాడుతున్న రోగులు ● రోడ్డెక్కిన జూడాలు ● నర్సులే ‘డాక్టర్ల’గా మారిన వైనం

మహారాణిపేట: కేజీహెచ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. స్టైఫండ్‌ పెంచాలంటూ 15 రోజులుగా ఆందోళన బాట పట్టిన జూనియర్‌ వైద్యులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి సమ్మె తీవ్రతరం చేశారు. ఓపీ, వార్డు సేవలకే పరిమితం కాకుండా చివరికి ‘అత్యవసర సేవల’ను కూడా బహిష్కరించి రోడ్డుపైకి రావడంతో కేజీహెచ్‌లో వైద్య వ్యవస్థ పూర్తిగా ఇబ్బందుల్లో పడింది.

వైద్యుల స్థానంలో నర్సులు..

జూనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని అత్యవసర విభాగాలు దిక్కులేనివిగా మారాయి. దిక్కుతోచని స్థితిలో ప్రాణాపాయంలో ఉన్న రోగులను కాపాడుకునేందుకు నర్సులే డాక్టర్ల అవతారమెత్తాల్సి వచ్చింది. అత్యవసర విభాగంలో నర్సే స్వయంగా స్టెతస్కోప్‌ పట్టుకుని రోగులను పరీక్షించాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది. నిపుణులైన వైద్యులు లేక, ప్రాథమిక వైద్యం కూడా అందక ఓపీ విభాగాల్లో తీవ్రమైన వ్యాధులతో వచ్చిన రోగులు గంటల తరబడి పడిగాపులు కాస్తూ విలవిలలాడారు.

రోడ్డుపై బైఠాయింపు..

ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా సోమవారం జూనియర్‌ డాక్టర్లు కేజీహెచ్‌ ఆవరణను హోరెత్తించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ప్రారంభమైన ప్రదర్శన ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్‌ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రాజేంద్రప్రసాద్‌ వార్డు నుంచి భావనగర్‌ వార్డు వరకు ప్రధాన రహదారిపై వైద్యులు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం వైద్యులు అక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనలో ఏపీ జూనియర్‌ డాక్టర్లు అసోసియేషన్‌ ఆంధ్ర మెడికల్‌ కాలేజీ అధ్యక్షుడు దినకర్‌ సాయి శ్రీనివాస్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌ జూనియర్‌ డాక్టర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కె.రవీందర్‌, ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్‌ అసోసియేషన్‌ (ఏపీజేయూడీఏ) విశాఖ యూనియన్‌ నాయకుడు డాక్టర్‌ శిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

చికిత్స కోసం కేజీహెచ్‌కు.. ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు

ద్విచక్రవాహనం నుంచి జారిపడి కాలికి తీవ్ర గాయమైన పంజాబ్‌ హోటల్‌ ప్రాంతానికి చెందిన ఆర్‌.రామారావు(74)ను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. జూనియర్‌ వైద్యుల సమ్మెతో చికిత్స అందకపోవడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారని రామారావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement