రోలుగుంట: జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన భూముల రీ సర్వే నిర్వహణ కోసం గతంలో వాయిదా పడిన గ్రామ సభను సోమవారం మరలా స్థానిక రైతులతో ఆర్డీవో స్థానిక రామమందిరంలో నిర్వహించారు. ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం భూ రీసర్వే కార్యక్రమం చేపట్టిందని, వైషమ్యాలకు పోకుండా సర్వేకు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన ఈనాం భూముల రీసర్వే వివరాలను రైతులకు చదివి వినిపించారు. 1969లో ఈ భూములపై రీసర్వే జరిగి, మరలా ఇప్పుడే ఈ సర్వే జరుగుతుందన్నారు. ఈ భూముల అమ్మకాలు, కొనుగోలుదారుల పరిస్థితి, స్థానిక నాయకుల ప్రమేయంతోనే సాగుదారులకు పాస్‌బుక్‌లు మంజూరు, పంపిణీ విషయాలపై ఆర్డీవో వివరిస్తుండగా సభలో పాల్గొన్న సాగుదారులు ఎవరికి పాస్‌బుక్‌లు ఇచ్చారో తమకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద కూడా తాతల నాటి భూసాగుకు సంబంధించిన రికార్డులున్నాయని వాటిని కూడా పరిశీలించి సాగులో ఉన్న తమ అర్హతలను పరిగణనలోకి తీసుకొని పాస్‌బుక్‌లు మంజూరు చేయాలని రైతుల తరపున బుచ్చిరాజు, శంకర్రావు, ఆర్.టి.నాయుడు తదితరులు ఆర్డీవోకు విన్నవించారు. అయితే సరైన సమాధానం లేకపోవడంతో రైతులందరూ ఒక్కసారిగా లేచి అధికారులను నిలదీయడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకొని రైతులను సముదాయించాలని చూసినా, వారు ఆగ్రహంతో గ్రామసభను బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో సభ చాలించి ఆర్డీవో వి.వి.రమణ తహసీల్దార్ నాగమ్మ అక్కడ నుంచి వెనుదిరిగారు. రైతులను తమ వద్ద ఉన్న రికార్డులతో మంగళవారం తన కార్యాలయానికి రావాలని ఆర్డీవో సూచించారని బుచ్చిరాజు, శంకర్రావు విలేకరులకు తెలిపారు. సాగులో ఉన్న తమ భూములను ఖాళీ చేసేది లేదని, చావోరేవో తేల్చుకుంటామని విలేకరుల వద్ద స్పష్టం చేశారు.


