డాబాగార్డెన్స్: పవిత్రమైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కందుల నాగరాజు సాగిస్తున్న దందాకు బ్రేక్ పడింది. ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పాలకమండలి సభ్యులకు, అధికారులకు, అర్చకులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆయన సాగిస్తున్న వ్యవహారశైలిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అనుమతుల్లేకుండానే టికెట్ల ముద్రణ: మార్గశిర మాసోత్సవాల సందర్భంగా డిసెంబరు 27న నిర్వహించతలపెట్టిన ‘మార్గశిర సహస్ర కలశాభిషేకం’ పేరిట చైర్మన్ సొంత నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు ఆమోదం పొందకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు తెరలేపడం దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ‘కందుల దందా’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి దేవదాయ శాఖ డి ప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సుజాత స్పందించారు.
ఆ టికెట్లు చెల్లవు: ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు జరగనున్న మార్గశిర ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రలో భక్తులు పాల్గొనేందుకు రూ.200 టికెట్ నిర్ణయించాలని పాలకమండలి సమావేశంలో చైర్మన్ కోరారని ఈవో తెలిపారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా చైర్మన్ సొంతంగా ప్రచురించిన కరపత్రాలు, మాన్యువల్ టికెట్లు ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, అటువంటి టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని ఆమె తేల్చిచెప్పారు. దేవస్థానం తరఫున అధికారికంగా టికెట్ల ధర ఖరారు చేస్తూ ఎలాంటి కరపత్రాలనూ ముద్రించలేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.


