● విప్లవాగ్ని రగిలించిన సమరయోధుడు
గొలుగొండ/పద్మనాభం: భరతమాత ముద్దు బిడ్డ...విప్లవాగ్నిని రగిలించిన మన్యం వీరుడు... ఆంగ్లేయులపై స్వాతంత్య్ర సమరం సాగించిన ధీరోదాత్తుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ అగ్గిపిడుగు.. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన పుట్టిన పాండ్రంగి.. మన్యంలో మొదటిగా అడుగుపెట్టిన గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నేడుఆవిప్లవ చరిత్రకుసజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పాండ్రంగిలో పుట్టి.. మన్యానికి చేరి
అల్లూరి అసలు పేరు శ్రీరామరాజు. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ముద్దుగా ‘చిట్టిబాబు’ అని పిలిచేవారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత, యోగం, వేదాంతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. విలువిద్య, గుర్రపు స్వారీ, ఆయుర్వేద వైద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకున్న తర్వాత స్వాతంత్య్రోద్యమం వైపు అడుగులు వేశారు. 20 సంవత్సరాల వయస్సులో 1917న గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామానికి వచ్చారు. మన్యంలో గిరిజనులు బ్రిటిష్ అధికారుల దోపిడీ, అణచివేతకు గురవుతున్న దృశ్యాలు ఆయనను కదిలించాయి. గిరిజనుల విముక్తి కోసం వారినే సమీకరించి సాయుధ పోరాటానికి సిద్ధం చేశారు. గంటం దొర, మల్లు దొర తదితరులు ఆయనకు అండగా నిలిచారు.
పోలీస్ స్టేషన్లపై మెరుపుదాడులు
1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడితో మన్యం పోరాటం ఒక్కసారిగా ఉధృతమైంది. మరుసటి రోజు కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి, 1922 సెప్టెంబర్ 2న జి.మాడుగుల పోలీస్‌స్టేషన్లపైనా దాడులు జరిగాయి. ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. సెప్టెంబర్ 24న దామణాపల్లి ఘాట్‌రోడ్డులో బ్రిటీష్ ఽప్రధాన అధికారి అయిన హైటర్‌ను హతమార్చి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరారు. అల్లూరిని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారీ సైనిక బలగాలను రంగంలోకి దించింది. అస్సాం రైఫిల్స్‌ను దించి అడవులను జల్లెడ పట్టినా.. అల్లూరి గెరిల్లా వ్యూహాల ముందు బ్రిటిష్ దళాలు చాలాకాలం తలవంచక తప్పలేదు. కీలక అధికారి అయిన స్కాట్ కవర్టు, హైటర్ హతమార్చడం, కీలక పోలీస్ స్టేషన్లును కొల్లగొట్టడంతో అల్లూరి సీతారామరాజును హతమార్చాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణియించింది.
1924 మే 7.. విప్లవతార అస్తమయం
దాదాపు రెండేళ్లపాటు సాగిన పోరాటం అనంతరం 1924 మే 7న మంప సమీపంలోని మాడేరు నది వద్ద అల్లూరి పట్టుబడ్డారు. బ్రిటిష్ సైనికులు ఆయనను కాల్చిచంపారు. అల్లూరి సీతారామరాజు కృష్ణదేవిపేటకు చెందిన చిటికెల భాస్కరనాయుడుతో స్నేహంగా ఉండేవారు. దీంతో ఆయన వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చి ... మృతదేహం అల్లూరి సీతారామరాజుదేనని నిర్ధారణ చేసుకుని మృతిని అధికారకంగా ప్రకటించారు.అల్లూరి భౌతికంగా దూరమైనా.. ఆయన రగిలించిన స్వాతంత్య్ర స్ఫూర్తి మాత్రం ఆరిపోలేదు. కృష్ణదేవిపేటలోనే సీతారామరాజు మృతదేహాన్ని ఖననం చేశారు. అక్కడే అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేశారు.


