త్యాగధనుడు అమరయ్యశెట్టి | - | Sakshi
Sakshi News home page

త్యాగధనుడు అమరయ్యశెట్టి

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

మాడుగుల రూరల్‌: మాడుగుల గడ్డపై పుట్టిన మహనీయుడు... దేశ స్వాతంత్య్రం కోసం విద్యను, వ్యక్తిగత భవిష్యత్తును, చివరకు తన ఆస్తులను సైతం త్యాగం చేసిన త్యాగధనుడు...పుట్టా అమరయ్యశెట్టి.

జాతీయోద్యమం వైపు అడుగులు : మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అదే సమయంలో విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్‌. కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అమరయ్య దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930లో జరిగిన చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయకుండా, పోలీసుల నిఘాను తప్పించుకుంటూ రహస్యంగా జాతీయోద్యమ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే బ్రిటీష్‌ పాలకుల నుంచి ఎక్కువ కాలం తప్పించుకోలేకపోయారు. చివరకు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బరంపురం, రాయవేలూరు జైళ్లలో సుమారు రెండేళ్లపాటు ఆయన జైలు జీవితం గడిపారు.

అమరయ్య ఇల్లే ఉద్యమ కేంద్రం : పుట్టా అమరయ్యశెట్టి దేశభక్తికి మాడుగులలోని ఆయన ఇల్లు ఒక చారిత్రాత్మక సాక్ష్యం. ఆయన జైలులో ఉన్న సమయంలో కూడా మాడుగుల ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమం బలహీనపడకూడదని భావించారు. స్థానిక ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కొనసాగించేందుకు తన నివాసాన్ని ఉద్యమ కార్యకలాపాలకు కేంద్రంగా అందించారు. ఈ క్రమంలో అప్పటి ప్రముఖ జాతీయ నాయకులు, భవిష్యత్తులో భారత రాష్ట్రపతిగా సేవలందించిన వరాహగిరి వెంకటగిరి (వి.వి.గిరి) మాడుగులకు వచ్చారు. అమరయ్య నివాసంలో సుమారు ఆరు నెలలపాటు ఉండి స్థానిక ప్రజల్లో స్వాతంత్య్రోద్యమంపై అవగాహన కల్పిస్తూ చైత న్యం నింపారు. అమరయ్యశెట్టి పేద రైతుల కోసం భూములు త్యాగం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మాడుగుల ప్రాంత అభివృద్ధికి విశేషంగా కషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement