గ్రామాల్లో దోమల స్వైరవిహారం
ఉమ్మడి జిల్లాలో పారిశుధ్యం అధ్వానం
హౌసింగ్ లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్
జెడ్పీస్థాయి సమావేశాల్లో సభ్యుల ఏకరువు
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా వ్యాధి వచ్చిన వారికి ఆస్పత్రుల్లో మందులు కొరత అధికంగా ఉందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో చెత్త చెదారాలు పేరుకుపోవడం వల్ల, వర్షాలు కురవడం వల్ల దోమలు విజృంభిస్తున్నాయని జెడ్‌పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ,ఉమాదేవి అన్నారు. గ్రామీణ, మన్య ప్రాంతాల్లో పెరుగుతున్న మలేరియా కేసుల పట్ల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానిక ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అంశాలపై సభ్యులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు చర్యలు చేపట్టాలని చైర్‌పర్సన్ ఆదేశించారు.
ఉపాధి పనుల్లో సదుపాయాలు కల్పించాలి
ఉపాధి కూలీలకు పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడ (షెడ్లు), తాగునీటి సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని ప్లాంటేషన్లలో చనిపోయిన 10 రకాల మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని సూచించారు.దేవరాపల్లి, కోటవురట్ల తదితర మండలాల్లో కాలువల పూడికతీత, రైవాడ ఆయకట్టు నీటి సరఫరా, జలధార పథకం పనుల పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను సభ్యులు ఉమాదేవి, సత్యం కోరారు.
జగనన్న ఇళ్లకు సదుపాయాలేవీ..
జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే విద్యుత్ సరఫరా, తాగునీటి కనెక్షన్లు కల్పించాలని జెడ్‌పీటీసీ సభ్యుడు గిరిబాబు కోరారు. నిలిచిపోయిన హౌసింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కూరగాయల సాగు, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సబ్సిడీలు, బ్యాంక్ లింకేజీ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సభ్యులు కోరారు. ఉమ్మడి జిల్లాల్లో హౌసింగ్ బిల్లు పెండింగ్‌లో ఉండడం పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధిలో
ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర : చైర్‌పర్సన్
గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన శిక్షణ సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025పై అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు.


