హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
తుమ్మసాల: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఈ నెల 13 నుంచి ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 15 తేదీ వరకు ప్రతి ఇల్లు, దుకాణం, ప్రభుత్వ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఐసీడీఎస్ (అంగన్‌వాడీ కేంద్రాలు), డీఎంహెచ్‌ఓ (పీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు), డీసీహెచ్‌ఎస్ ఆసుపత్రులు, రవాణా శాఖ పరిధిలోని అన్ని కేంద్రాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో జాతీయ జెండాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులందరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పోస్ట్ చేయాలని తెలిపారు. ఈ నెల 10 నుండి 15 వరకు ఈ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘మరి మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరాలని తెలిపారు. అధికారులందరూ వీడియో రూపకల్పన పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం, ఆ లింకులను వాట్సాప్ గ్రూపుల్లో అప్‌లోడ్ చేయాలని, సమాచార శాఖ అధికారి దీనిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యాశాఖ ద్వారా పాఠశాల విద్యార్థులతో కూడా ఇదే శైలిలో వీడియోలను రికార్డు చేయించాలన్నారు. ప్రతి మండలం నుంచి అత్యుత్తమంగా నిలిచే 20 వీడియోలను ఎంపిక చేసి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి పంపించాలన్నారు. ఈ నెల 13న ప్రత్యేకంగా ‘హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో పాటు స్థానిక పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయాలని, ఈ ర్యాలీలో దాదాపు 3 వేల నుండి 5వేల మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే రోజు పురపాలక, మండల స్థాయిలలో భారీ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ 1 కిలోమీటరు పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 14న ప్రతి ప్రభుత్వ కార్యాలయం కాంపౌండ్ లోపల, సమీపంలోని పాఠశాల ప్రాంగణాల్లో ప్రతి అధికారి కనీసం 10 స్వదేశీ రకాల మొక్కలను నాటాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ భవనాలను ఈ నెల 14 సాయంత్రం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు (3 రోజుల పాటు) విద్యుత్ కాంతులతో అలంకరించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారులందరూ జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకొని తమ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి. రమణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


