నక్కపల్లి: గ్రామస్తులు పశువుల మేతకు, మత్స్యకారులు చేపల వేటకోసం ఉపయోగించుకుంటున్న గోబందను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని డీఎల్‌పురం గ్రామస్తులు స్పష్టం చేశారు. మంగళవారం ఈ గోబందను స్వాఽధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు ఆడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. డీఎల్‌పురం సర్వే నంబరు 81లో సుమారు 190 ఎకరాల ప్రభుత్వ భూమి (గోబంద) ఉంది. ఈ భూమిలో చాలా ఏళ్ల నుంచి గ్రామస్తులు పాడి రైతులు పశువుల మేత కోసం, దళితులు గుల్లబట్టీల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఈ భూమిని స్టీల్‌ప్లాంట్‌కు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే అధికారులతో కలసి గతంలో పలు సందర్భాల్లో సర్వే చేసేందుకు సిద్ధపడగా గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈనెల 10వ తేదీన నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఈ గోబందను పశువుల మేతకు, గుల్లబట్టీలకు ఉపయోగించుకుంటున్నామని దీన్ని స్టీల్‌ప్లాంట్‌కు ఇవ్వడానికి కుదరదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ మంగళవారం మరోసారి రెవెన్యూ, సర్వేశాఖ అధికారులు మందీ మార్బలంతో వెళ్లి భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గ్రామస్తుల ఆమోదం లేకుండా ఈ గోబందను స్వాధీనం చేసుకోడానికి వీల్లేదని మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ, మాజీ సర్పంచ్‌లు కిల్లాడ రామకృష్ణ, మత్స్యకార నాయకులు ఓసిపల్లి చిట్టిబాబు, మేరుగు గోవిందు స్పష్టం చేశారు. డీఫారం, జిరాయితీ భూములతోపాటు గ్రామస్తులు తమ అవసరాల కోసం కేటాయించుకున్న భూములను కూడా స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. మరోసారి గ్రామస్తులంతా సభ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వస్తామని అప్పటివరకు ఈ భూముల జోలికి రావొద్దని వారు అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కనకారావు, రాంబాబు, శ్రీను, రమణ పాల్గొన్నారు.


