తుమ్మపాల: రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో సత్వర వైద్యం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి – రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్’ (పీఎం రాహత్) పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో (మొదటి గంట) బాధితులకు ప్రాణాపాయం కలగకుండా, వేగవంతమైన నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, బాధితులకు ఆర్థిక భారం లేకుండా, నాణ్యమైన చికిత్సను అందజేయడానికి ఈ పథకం రూపొందించబడిందన్నారు. ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ చికిత్స వర్తిస్తుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు 48 గంటల వరకు, ఇతర కేసుల్లో 24 గంటల వరకు ఆసుపత్రులు తప్పనిసరిగా స్థిరీకరణ చికిత్స అందించాలన్నారు. పోలీస్ రిపోర్టింగ్, హాస్పిటల్ క్లెయిమ్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ పథకం పూర్తి డిజిటల్ విధానంలో పనిచేస్తుందని, ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో అమలు చేయబడుతుందని, దీనికి సంబంధించి ఆసుపత్రులకు చెల్లింపులు’ మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా జరుగుతుందన్నారు. జిల్లాలో–5 ప్రైవేట్, 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 13 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలులో ఉంటుందన్నారు.


