చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు
సీలేరు: ఆంధ్ర–ఒడిశా ఉమ్మడి నిర్వహణలోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నాటికి అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రాజారావు తెలిపారు. మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి గురైన మాచ్‌ఖండ్ కేంద్రంలో యూనిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 8న రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. మూడో యూనిట్ మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో, ఐదో యూనిట్‌ను రెండో వారంలో, నాలుగో యూనిట్‌ను సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆరో యూనిట్ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దశల్లో అనుమతులు వచ్చాయని, మిగిలిన అనుమతులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని సీఈ తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే వరకు మెగా ఇంజినీరింగ్ కంపెనీలో, అనంతరం జలవిద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికులుగా ఉపాధి కల్పిస్తామన్నారు. నిర్వాసితుల ఉపాధి బాధ్యతను ప్రభుత్వం, ఏపీ జెన్‌కో తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిసరాలను గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేసేందుకు 10 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించే చెట్ల కొమ్మలతో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఈ వెంట ఎస్సీ జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు.


