అచ్యుతాపురం రూరల్: అనుమతి లేని రహదారుల్లో మితిమీరిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అచ్యుతాపురం కూడలి నుంచి పూడిమడక వెళ్లే దారిలో శుక్రవారం అర్ధరాత్రి గోతిలో ఇరుక్కుపోయి భారీ బొగ్గు లారీ ఒక్కసారిగా ఓ వైపునకు ఒరిగిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రజల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా భారీ వాహనాలు ఇరుకై న రహదారులపై తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే కొన్ని వాహనాలు పరిమితికి మించి మెటీరియల్ లోడ్ చేసుకుని ఇరుకై న రహదారులపై ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునేందుకు తగినంత స్థలం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, నివాస ప్రాంతాలు, ప్రజల రద్దీ ఉండే ప్రాంతాల మీదుగా భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశముంది. ప్రజల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నియంత్రణ విధించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు, వాహన సామర్థ్యం, లోడ్ పరిమితులను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగే వరకూ అధికారులు వేసి చూడకుండా భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
ఇరుక్కుపోయిన భారీ బొగ్గు లారీ.. తప్పిన పెను ప్రమాదం


