వరి నారు మడులను మోటారుతో తడుపుతున్న రైతులు
రావికమతం: మండలంలో దొండపూడి, కొత్తకోట, కిత్తంపేట, మత్సవానిపాలెం, మేడివాడ, టి.అర్జాపురం తదితర గ్రామాల్లో నారు మడులను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుకు అదనపు భారం అవుతున్నా బోరుబావులున్నా చోట్ల మోటర్లతో నారుమళ్లకు నీటి తడులు అందిస్తున్నారు. బోర్లు, చెరువులు లేని చోట్ల రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది డీజిల్ ఇంజిన్లు పైపులతో దూరం నుంచి నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు.
కల్యాణపులోవలో అడుగంటిన నీళ్లు
కల్యాణపులోవ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఏడాది వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కల్యాణపులోవ జలాశయం ఆయకట్టు కింద దొండపూడి, గంపవానిపాలేం, జెడ్.కొత్తపట్నం, జెడ్.బెన్నవరం, కొత్తకోట, మర్రివలస, చీమలపాడు, మత్సవానిపాలెం తదితర 14 గ్రామాల్లో రైతులు 6వేల ఎకరాల్లో వరి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులుకాగా బుధవారం నాటికి 449.5 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి 456 అడుగులు పైబడి నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు 30 రోజుల వరకు సరిపోతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరి పంటకు 120 రోజుల వరకు నీరు అవసరం ఉంటుంది, కానీ నీరు వదిలిన 30 రోజుల లోపు వర్షాలు పడకపోతే రైతులు పరిస్థితి ఏంటి రైతులు వాపోతున్నారు.


