సాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు నిరుద్యోగ భృతి రూ. 3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ ఏర్పాటు చేస్తామని, సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగిస్తామంటూ హామీలు ఇచ్చారు.. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌న్‌ను రద్దు చేసి దానికి అదనంగా కొన్ని ఉద్యోగాలు యాడ్ చేసి మెగా డీఎస్సీ పేరిట రిక్రూట్‌మెంట్ జరిగింది. అందులో కూడా స్పోర్ట్స్ కోటా కొత్త జీవోలంటూ భారీ అవకతవకలకు పాల్పడ్డారు. కనీస విద్యార్హత గానీ, డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే అక్రమమార్గంలో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ డీఎస్సీ అక్రమాలపై రెండు నెలలుగా రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులు, నిరుద్యోగులు వరుస ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను భర్తరఫ్ చేయాలని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలంటూ శాంతియుతంగా ఇటీవల చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వరుసగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై దుర్భాషలకు దిగారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జగన్ హయాంలో సున్నా ప్రభుత్వ ఉద్యోగాలు..కూటమి హయాంలో 16 వేల ఉద్యోగాలు..అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడంపై కూటమి నేతల దిగజారుడుతనానికి పరాకాష్టగా ప్రజలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో జిల్లాలో 30,654 ఉద్యోగాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 30,654 మందికి ఉద్యోగాలు కల్పించింది. అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమల్లో, రేషన్ పంపిణీ వాహనాల పేరిట, పశుసంవర్ధక శాఖ అంబులెన్స్‌లు, 104, 108 అంబులెన్‌న్స్‌ల్లో 3,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించింది. అదే కూటమి ప్రభుత్వంలో జిల్లాలో 25 వేలకు పైగా ఉద్యోగాలను తీసేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన దానినే అమలు చేశారు. చందబాబు ప్రభుత్వంలో తీసిన ఏకై క డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు వస్తే అందులో భారీ అవకతవకలకు పాల్పడ్డారు.
జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు...
జిల్లా వ్యాప్తంగా 10,000 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు
వైద్య, ఆరోగ్య శాఖలో 2,000 అవుట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలు
ఎండోమెంట్, ఏపీపీఎస్సీ, ఇతర శాఖల్లో 500 ఉద్యోగాలు
ఆప్కాస్‌లో 4,000 ఉద్యోగాలు
జిల్లాలో 12,000 వలంటీర్ ఉద్యోగాలు
ఏపీఎస్‌ఆర్‌టీసీలో 1,800 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
ప్రైవేట్, ఫార్మా పరిశ్రమల్లో 2 వేల మందికి ఉపాధి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్(ఎంటీఎస్) రిక్రూట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది టీచర్లను నియమిస్తే..వీటిలో ఉ మ్మడి జిల్లాలో 354 మందికి ఉద్యోగాలు
ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడు దల. కోర్టు కేసు కారణంగా నిలిపివేత
సుమారుగా 7 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. ఎన్నికలు, కోర్టు కేసుల కారణంగా నిలిపివేత.
తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి...
మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అవమానిస్తూ హోర్డింగ్స్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం డీఎస్పీ పి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాయంలో రాష్ట్రంలో వ్యాప్తంగా పాలన చేపట్టిన తొలి నాలుగు నెలల్లోనూ లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఐదేళ్లలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అవి ఆధారాలతో పాటు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయంటూ వాటిని వక్రీకరిస్తూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సున్నా ఉద్యోగాలంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో హోర్డింగ్స్ తొలగించకపోతే శాంతియుత ఆందోళన చేపడతామని గణేష్ అన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు, పార్టీ నేతలు ఏకా శివ, శానపతి వెంకటరత్నం, చిటికెల రమణ, పాణిశాంతరామ్, నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సుర్ల నాయుడు, జిల్లా ప్రచార కమిటీ నాయకులు పిళ్లా శ్రీను, హరిబాబు, రాజుబాబు, రఘు కూటమి తప్పుడు ప్రచారాలను ఖండించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి అన్ని వర్గాల ప్రజలను మోసం
చేయడమే కాకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై బురద చల్లుతున్న కూటమి నేతలపై ప్రజలు, యువత, విద్యార్థులు మండిపడుతున్నారు.
తాజాగా వాస్తవాలను వక్రీకరిస్తూ మున్సిపాలిటీలో తప్పుడు వ్యాఖ్యలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.


