యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం హరిపురంలో భాగవతుల చారిటబుల్ ట్రస్టు(బీసీటీ) సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూములను చదును చేసే పనులను శనివారం స్థానికులు, బీసీటీ ఉద్యోగులు, మహిళలు అడ్డుకున్నారు. బీసీటీ కార్యకలాపాల కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూమిని లీజుకు ఇచ్చింది. 2014లో లీజు గడువు ముగిసింది. ఈ భూముల్లో కొంత విస్తీర్ణంలో ప్రత్యేక వాణిజ్య మండలిలో భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే నిమిత్తం కేటాయించడానికి సర్వే చేశారు. ఇటీవల కలెక్టరు ఆ భూమిని చదును చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ భూముల్లో శనివారం పొక్లెయిన్‌తో స్థానిక రెవెన్యూ అధికారులు చదును చేయించే పనులు ప్రారంభించారు. ఆ పనులను బీసీటీ ఉద్యోగులు, కొందరు మహిళలు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు, రాంబిల్లి సీఐ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 50 ఏళ్లు గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన బీసీటీ భూములను స్వాధీనపర్చుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి కోల్పోతారని బీసీటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.


