నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌

కె.కోటపాడు: అర్జీదారుల సమస్యలను పరిశీలించి ని ర్ణీత గడువులోగా పరిష్కరించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ తెలిపారు. శుక్రవారం కె.కోటపాడులో ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 411 వినతులను జేసీ, డీఆర్వో, ఆర్డీవో స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలపై 227, మిగిలిన వివిధ శాఖల్లో సమస్యల పరిష్కారానికి 184 అర్జీలు వచ్చాయి. కె.కోటపాడు మండలం చౌడువాడ మీదుగా శారదానదీ గర్భంతోపాటు పరీవాహన ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను చేపడుతున్నారని వైస్‌ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఆకుల సాయిప్రసాద్‌ జేసీకి ఫిర్యాదు చేశారు. నదీ పరీవాహక ప్రాంతంను గతంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు బ్లాక్‌ జోన్‌గా ప్రకటించారని తెలిపారు. ఈ నది ప్రాంతంలోనే చౌడువాడ గ్రామానికి నీరందించే మంచినీటి పథకాలతోపాటు నాలుగు కాలువలకు నీరు వెళ్లే కట్టడాలు ఉన్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

● పాచిలవానిపాలెంలో ప్రమాదకర విద్యుత్‌ స్తంభాలను మార్చడంతోపాటు ఇతరత్రా విద్యుత్‌ సమస్యలను ఎలక్ట్రికల్‌ అధికారులు సరిచేయాలని వైస్‌ ఎంపీపీ సూర్యనారాయణ కోరారు.

● లంకవానిపాలెంలో ఎండోమెంట్‌ సమస్యను పరిష్కరించాలని మాజీ సర్పంచ్‌ వేచలపు దొరబాబు వినతిపత్రం అందించారు. ఇక్కడ నివాసితులకు గ్రామకంఠంగా అప్పటి తహసీల్దార్‌ సర్టిఫికెట్‌ అందించారన్నారు. రీసర్వేలో గ్రామకంఠంను ఎండోమెంట్‌గా నమోదు చేసినట్లు వాపోయారు.

● చౌడువాడ గ్రామ పంచాయతీ క్లాప్‌మిత్రలకు వేతనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌ దాడి ఎరుకునాయుడు వినతిపత్రం అందించారు. గ్రామ యువకులకు క్రీడా స్థలాన్ని కేటాయించాలని కోరారు.

● చోడవరం నుంచి చౌడువాడ మీదుగా విశాఖకు ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామానికి చెందిన తనకల అప్పలనాయుడు(పట్టాలు) వినతిపత్రం అందించా రు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డీఆర్వో సత్యనారాయణ, ఆర్డీవో అయేషా, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో సాంబశివరావు, చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement