అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అధ్వానం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అధ్వానం

Aug 6 2026 12:33 AM | Updated on Aug 6 2026 12:33 AM

రికార్డుల నిర్వహణలో లోపాలపై ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు ఆగ్రహం

ఆగస్టు సరకులు పంపిణీ చేయకుండానే సంతకాల సేకరణ

ఈ–స్టాక్‌కు కేంద్రంలోసరుకులకు మధ్య వ్యత్యాసం

కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు షోకాజ్‌ నోటీసులు

నక్కపల్లి: మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు చాలా అధ్వానంగా ఉందని, రికార్డుల నిర్వహణ సరిగా లేదని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, కేజీబీవీలు, పౌర సరఫరాల గోదాములను తనిఖీ చేశారు. చినదొడ్డిగల్లులో మూడు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఉన్న సరుకులు, లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకులకు, స్టాక్‌ రిజిస్టర్‌లకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్న విషయాన్ని గుర్తించారు. టిహెచ్‌ఆర్‌ (టేక్‌ హోమ్‌రేషన్‌) పంపిణీ రిజిస్టర్లను పూర్తిగా నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. చినదొడ్డిగొల్లు 1 కేంద్రంలో ఈ స్టాక్‌ , భౌతిక నిల్వల మధ్య భారీ వ్యత్యాసం గుర్తించారు. ఈ స్టాక్‌లో 1052 కోడిగుడ్లు నమోదై ఉండగా భౌతికంగా 258 కోడిగుడ్లు మాత్రమే ఉండడం, 532 కోడిగుడ్లకు సంబంధించి వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. చినదొడ్డిగల్లు–2 కేంద్రంలో హాజరు రిజిస్టరులో 9 మంది పిల్లలు మాత్రమే నమోదు చేసి ఉండగా, ఆన్‌లైన్‌లో 10 మంది పిల్లలు నమోదు చేసి పది మంది హాజరైనట్టు నమోదు చేయడాన్ని గుర్తించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా సూపర్‌వైజర్‌ తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేయడాన్ని కమిషన్‌ సభ్యుడు తప్పుపట్టారు. సూపర్‌వైజర్‌ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. చినదొడ్డిగల్లు–3 కేంద్రంలో ఆగస్టుకు సంబంధించి టేక్‌ హోమ్‌ రేషన్‌ పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్టు రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు, లబ్ధిదారుల సంతకాలు తీసుకోవడాన్ని గుర్తించారు. సీడీపీవో కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్టుగా విజిటింగ్‌ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడాన్ని కూడా గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో పిల్లలకు ఉదయం 11 గంటలు దాటినా పాలు, గుడ్లు సరఫరా చేయకపోవడం లేదని, ఇలాంటి నిర్లక్ష్యం చిన్నారుల పోషకాహార హక్కులకు భంగం కలిగించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఎంపీపీ పాఠశాల, బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, నక్కపల్లిలో కేజీబీబీ పాఠశాల, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను పరిశీలించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఆహార నిల్వలు, నాణ్యత రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, పోషకాహార పంపిణీలో లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలపై సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తున్నట్టు లక్ష్మిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో నాణ్యమైన ఆహారం, గుడ్లు, పాలు సకాలంలో పంపిణీ చేయడంతో పాటు అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని లక్ష్మిరెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీఎస్‌డీవో కె.వి.ఎల్‌.ఎన్‌.మూర్తి, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ రమణ, డీటీ గణపతిరావు, తూనికలు, కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement