ఎంపీ రమేష్ బినామీ కావడంతో లీజుదారు పేరు వెల్లడించని రాంబిల్లి పోలీసులు
కూటమి ప్రభుత్వం కంటితుడుపు చర్యలపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలం పంచదార్ల ప్రాచీన శైవక్షేత్రం ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఫణిగిరి కొండ సర్వే నంబరు 1లో నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతల పోరాటంతో దిగివచ్చిన కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి దిగువస్థాయి అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుని, అసలు సూత్రధారుల జోలికి మాత్రం వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫణిగిరి కొండ సర్వే నెంబరు 1లో లీజు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు నిర్థారణ కావడంతో లీజుదారుడిపై మంగళవారం అనకాపల్లి గనులశాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో లీజుదారుడి పేరు, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రాథమికంగా గుర్తించిన నేరం వివరాలు మాత్రం వెల్లడించడానికి రాంబిల్లి సీఐ ససేమిరా అంటున్నారు. పలువురు మీడియా ప్రతినిధులు కేసు వివరాలు అడిగితే రాంబిల్లి సీఐ సీహెచ్ నర్శింగరావు దాటవేత ధోరణి ప్రదర్శించారు.
అక్రమార్కులకు సీఐ అండదండలపై ఆరోపణలు
గతంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానికులపై కేసులు నమోదు చేస్తామని అప్పట్లోనే రాంబిల్లి సీఐ నర్శింగరావు హెచ్చరించి, బెదిరించారన్న ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా నిబంధనలు తుంగలోకి తొక్కి భారీ అక్రమ మైనింగ్ చేసుకోవడానికి కూటమి పార్టీల నాయకులకు రెడ్ కార్పెట్ వేసి మరీ రాంబిల్లి సీఐ అక్రమార్కులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలందించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఫణిగిరి కొండ సర్వే నెంబరు 1లో స్థానిక ఎంపీ బినామీ పేరుతో 4.99 హెక్టార్లలో మైనింగ్ కోసం గనుల శాఖ నుంచి ఈ ఏడాది మే 15వ తేదీన లీజు విజయ్‌కుమార్ నాయుడు దాసమనేని పేరుతో అనుమతి పొందారు. లీజు అనుమతులన్నింటినీ ఉల్లంఘించి మరీ ఇష్టారాజ్యంగా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించుకుపోయినా రాంబిల్లి పోలీసులు ఏ రోజూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
అసలు వ్యక్తులను రక్షించే కుట్ర!
అక్రమ మైనింగ్‌తో ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి పురాతన కాలం నుంచి వస్తున్న ఐదు పుణ్యధారల్లో ఒకటి ఆగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చేశారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానికుల సెంటిమెంటును గౌరవించిన వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. శాసనమండలి విపక్ష నేత బొత్ససత్యనారాయణ, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని ప్రజలకు తెలిసేలా చేశారు. పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు జరగడంతో కూటమి సర్కారు కంటితుడుపు చర్యలకు ఉపక్రమించింది. లీజు దారుడిపై కేసు నమోదు చేశారు. లీజుదారుడు కూటమి ప్రజాప్రతినిధి బినామీ కావడంతో కేసు నమోదు చేసినా అతని పేరు కూడా వెల్లడించకపోవడం వెనుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


