రాత్రి వేళల్లో వార్డెన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి
అడ్మిషన్లు పెంపులో రాజీ లేదు
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు
తుమ్మపాల: పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హైస్కూల్ ప్లస్, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, డేటా ఆధారంగా బడి బయట ఉన్న పిల్లలు, షెడ్యూల్డ్ కమ్యూనిటీ పిల్లల డేటాను పరిశీలించి అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ విజయకృష్ణన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలో మంజూరైన సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల అడ్మిషన్లు ఉండాలని, అడ్మిషన్ల విషయంలో ఎలాంటి రాజీ లేదని అన్నారు.
ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి
విద్యార్థులందరికీ మెడికల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా జరగాలని సమీప పీహెచ్‌సీ డాక్టర్లతో మాట్లాడి, వారానికి కనీసం 1 నుంచి 2 రోజులు ఏఎన్‌ఎంల ద్వారా క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌వో వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ నీటిని 100 శాతం బాగా మరిగించి, చల్లార్చిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలని, వాటర్ టెస్టింగ్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించి, ఆ డేటాను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. వండిన ఆహారాన్ని ముందుగా నిర్వాహకులు, సిబ్బంది రుచి చూడాలని, మెనూలో అందించే కోడిగుడ్డు కచ్చితంగా 50 గ్రాములు ఉండాలని చెప్పారు. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించాలని, బాలికలకు రుతుక్రమ పరిశుభ్రతపై కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రతపై బాధ్యత సిబ్బందిదే..
డిపార్ట్‌మెంట్ అధికారులు, ముందస్తు అనుమతి ఉన్నవారు తప్ప ఇతర వ్యక్తులెవ్వరూ హాస్టళ్ల లోపలికి రావడానికి వీల్లేదని, విద్యార్థుల భద్రతకు సిబ్బందిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. గంజాయి, సిగరెట్లు, ఖైనీ, గుట్కా ఇతర అడిక్టివ్ పదార్థాలు హాస్టళ్లలోకి రాకుండా అరికట్టాలని, స్కూల్ కాంపౌండ్ వెలుపల దుకాణాల్లో పిల్లలకు ఏం విక్రయిస్తున్నారో గమనించాలని, వారు సహకరించకపోతే స్థానిక పోలీస్‌స్టేషన్‌కి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు, డ్వామా పీడీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


