నక్కపల్లి: మండలంలో గునిపూడిలో సర్వే నంబరు24/10లో ఉన్న లక్ష్మీదేవి కొండభూమిలో సాగుదార్లను తొలగించి ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడిన రెవెన్యూ అధికారులను సాగుదారులు అడ్డుకున్నారు. లక్ష్మిదేవికొండలో ఉన్న ప్రభుత్వ భూమిలో గ్రామానికి చెందిన సుమారు150 మంది సాగు చేసుకుంటున్నారు. ఈ లక్ష్మిదేవి కొండను కూటమి ప్రభుత్వం ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌కు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది. సాగుదార్లకు నష్టపరిహారం చెల్లించకుండా కొండ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ సాగుదారులు నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. భూముల వద్ద వంటావార్పు నిర్వహిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కొనసాగుతుండగా రెవెన్యూ అధికారులు కొండ చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు. దీన్ని సాగుదారులంతా వ్యతిరేకించారు. కొండ భూముల వద్ద నిరాహర దీక్షలు చేపట్టారు. వీరికి సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు సంఘీభావం ప్రకటించారు. ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు వచ్చిన తహసీల్దార్ చిన్నికృష్ణ, సీఐ మురళితో వాగ్వాదానికి దిగా రు. సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడానికి నిబంధనలు వర్తించవని చెబుతున్న అధికారులు, ఇదే భూములు టౌన్‌షిప్‌కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. డీఫారం, జిరాయితీ రైతులకు చెల్లించిన విధంగానే సాగుదార్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు స్వాధీనానికి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. తహసీల్దార్, సీఐలు వెనుదిరిగారు. నాయకులు రాజేష్, సాగుదార్లు డి.కృష్ణ, అప్పారావు, గోవిందు పాల్గొన్నారు.


