కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

సాక్షి, అనకాపల్లి: అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు పథకాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలని, నిలిచిపోయిన బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్మికులు కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఆందోళనలో భాగంగా కార్మికులు ఒక్కసారిగా కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ భారీగా మోహరించి న పోలీసులకు, స్కీమ్‌ వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పలువురు వర్కర్లతో పాటు మహిళా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆందోళనకారులతో మాట్లాడేందుకు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అక్కడకు చేరుకున్నప్పటికీ కార్మికులు ఆయనతో చర్చలకు నిరాకరించారు. కలెక్టర్‌ నేరుగా వచ్చి తమ సమస్యలపై స్పందించి, స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించారు.

స్మార్ట్‌ కిచెన్‌తో 2,400 కార్మికుల ఉపాధిపై దెబ్బ

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం పేద మహిళల పొట్ట కొట్టేందుకు సిద్ధమైందని, మధ్యాహ్న భోజన పథకంలో ‘స్మార్ట్‌ కిచెన్‌’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఏళ్ల తరబడి వంట చేస్తున్న పేద మధ్యాహ్న భోజన కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతోందని ఆందోళనకారులు ఆరోపించారు. ఆధునికీకరణ ముసుగులో ఈ పథకాన్ని బడా కంపెనీలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 2,400 మంది వంట కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడనుందన్నారు.

త్వరలో చలో అమరావతి..

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని, శానిటేషన్‌ కార్మికులకు గడిచిన ఐదు నెలలుగా నెలకు రూ.6 వేల చొప్పున జీతాలు బకాయి పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాట్యుటీ కోసం కూడా కార్మికులు ఏళ్ల తరబడి పోరాటాలు చేయాల్సి రావడం ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులతో ’చలో అమరావతి’ నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్మికుల పొట్టకొడుతున్న కూటమి

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసే కార్మికుల పొట్టకొడుతోందని మండిపడ్డారు. రూ.కోట్ల రాయితీలు పొందుతున్న బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లపై చూపిస్తున్న ప్రేమ.. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న స్కీమ్‌ వర్కర్లపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు. తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెంచినప్పుడు, మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మహిళా సాధికారత ఎక్కడ?

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శంకరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. స్కీమ్‌ రంగాల్లో పనిచేస్తున్న వారిలో అత్యధికులు మహిళలేనని గుర్తుచేశారు. ఒకవైపు మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్న ఈ ప్రభుత్వం, వారి శ్రమకు తగిన కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు, ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వి. సత్యవతి, వెలుగు వీవోఏ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌. రూపాదేవి, మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి, శానిటేషన్‌ వర్కర్స్‌ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి తదితరులు పాల్గొని స్కీమ్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు.

సమస్యల పరిష్కారానికి స్కీమ్‌ వర్కర్ల ఆందోళన

పలువురికి గాయాలు

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి

స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ డీఆర్వోతో సంప్రదింపులకు తిరస్కరణ

ప్రభుత్వ తీరు మారకపోతే ’చలో అమరావతి’

కనీస వేతనాలు అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదు

కలెక్టర్‌ వద్ద ఆందోళన చేస్తున్న స్కీమ్‌వర్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement