కత్తెర..! | - | Sakshi
Sakshi News home page

కత్తెర..!

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

సాక్షి, అనకాపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)–2026లో భాగంగా జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విడుదల చేశారు. గతంలో జిల్లాలో మొత్తం 13,02,389 మంది ఓటర్లు ఉండగా, 11,93,053 ఓట్లు డిజిటలైజేషన్‌ అయినట్టు వెల్లడించారు. దాదాపు 1,09,336 ఓట్లను తొలగించారు. అధికారికంగా ఇది ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమమే అయినప్పటికీ, అమలైన తీరుపై రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ముసాయిదా జాబితాలో ప్రస్తుతం మహిళలు 6,11,914, పురుషులు 5,81,112, థర్డ్‌ జండర్‌ 27 ఓట్లు ఉన్నట్లు తెలియజేశారు.ఆగస్టు ఒకటో తేదీ నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు యాడెడ్‌, షిఫ్టెడ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ముసాయిదా ప్రచురణ అనంతరం ప్రతి ఓటరు తన పేరు, వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పేరు జాబితాలో లేకపోతే ఫారం–6 ద్వారా పేరు చేర్చుకోవడానికి, వివరాల్లో మార్పులు లేదా సవరణలకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్లెయిములు, అభ్యంతరాలను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమర్పించవచ్చని కలెక్టర్‌ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జాబితాలో పేరు లేదని ఆందోళన చెందవద్దని, ఫారం–6 సమర్పిస్తే మళ్లీ ఓటరుగా పేరు నమోదు అవుతుందన్నారు.

ఎక్కువ ఆందోళన షిఫ్టెడ్‌ ఓట్లపైనే..

తొలగించిన 1,09,336 ఓట్లలో అత్యధికంగా మరణించిన వారివి 48,557 ఉండగా, 33,153 షిఫ్టెడ్‌ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 21,816 ఓట్లు, చోడవరం నియోజకవర్గంలో 19,498, అత్యల్పంగా మాడుగుల నియోజకవర్గంలో 14,154 ఓట్లు తొలగించారు. వీటిలో ఎక్కువగా మరణించినవారి ఓట్లు కాగా, ఆ తర్వాత షిఫ్టెడ్‌ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.అదేవిధంగా డబుల్‌ ఎంట్రీలు అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 3,713, ఆ తర్వాత యలమంచిలిలో 2,804 ఉన్నాయి. ’సర్‌’ ప్రక్రియలో శాశ్వత నివాసాన్ని నిర్ధారించే సమయంలో వీరిలో చాలా మంది పేర్లు తొలగించారని తెలుస్తోంది. ముఖ్యంగా షిఫ్టెడ్‌ ఓట్లపైనే రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మ్యాపింగ్‌పై

ఆరోపణలు

’సర్‌’ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు నిర్వహించిన మ్యాపింగ్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తొందరపాటు, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్ల వివరాలు సరిగా నమోదు కాలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒకే నియోజకవర్గంలో బూత్‌ మారిన కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు, వివాహం తర్వాత చిరునామా మారిన మహిళలు, ఉద్యోగరీత్యా బదిలీ అయిన ఉద్యోగులు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్‌లో సరిగా నమోదు కాలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అధికార యంత్రాంగం అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు అధికారికంగా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement