మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

డీఎస్సీ అక్రమాలపై

సీబీఐ విచారణ చేపట్టాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

అనకాపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ తో విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలో నీట్‌ పరీక్ష పేపరు లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని, అదే విధంగా రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, కంబాల జోగులు, అన్నంపరెడ్డి అదీప్‌రాజు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, పలు నియోజకవర్గాల పరిశీలకులు, నాయకులు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీలో స్కామ్‌ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని, అందువల్ల విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో 40 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే, కూటమి పాలనలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడిపోయారని చెప్పారు. పేద విద్యార్థులు ఇంగ్లిష్‌ విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వ పాలన సాగితే, కూటమిపాలనలో కార్పొరేట్‌ పాఠశాలలను అభివృద్ధిచేసే విధంగా చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లేని పక్షంలో నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందజేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.10వేల కోట్లు ఉన్నాయని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. చదువు పూర్తయినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారుని తెలిపారు. చేసేదిలేక పలువురు విద్యార్థులు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలు ఆడడం అన్యాయమన్నారు.

3 నుంచి పోరు ఉధృతం

డీఎస్సీ అక్రమాలపై పోరు ఉధృతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆగస్టు 3,4 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 5 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు, 10న నియోజకవర్గ కేంద్రాల్లో భారీర్యాలీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబునాయుడికి నమ్మకం ఉంటే డీఎస్సీలో అక్రమాలు జరిగినందున విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో రాజీనా మా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్‌ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత విద్యాశాఖలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించే వరకూ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేసే వరకూ పోరాటాలు చేస్తామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ మాట్లాడుతూ డీఆర్వోకు నాలుగు ప్రధాన డిమాండ్లపై వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కూటమి నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, వివిధ నియోజకవర్గాల పరిశీలకులు పిన్నమరాజు సతీష్‌వర్మ, వీసం రామకృష్ణ, దంతులూరి దిలీప్‌కుమార్‌, పైలా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొండ రాంబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, 80,81,84 వార్డు ఇన్‌చార్జులు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కె.రాఘవ, 82 వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్‌, అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్‌, మలసాల కిశోర్‌, సీనియర్‌ నాయకులు బుదిరెడ్డి దేముడుబాబు, తంగేల రామకృష్ణ, పి.డి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement