ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

అల్లిపురం: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భద్రతా ఏర్పాట్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్‌ నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు. రేపు విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నేపథ్యంలో నగరంలో విస్తృత బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్‌ డా. శంఖబ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరం కాకపోతే నగరంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు, అదనపు పోలీసు బందోబస్తు, టోయింగ్‌ వాహనాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సభకు వచ్చే బస్సులకు ప్రత్యేక మార్గాలు కేటాయించినట్లు చెప్పారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్‌ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement