చోడవరంలో విలేకరులతో మాట్లాడుతున్న పిటిషనర్ తరపు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్
చోడవరం: మరమ్మతులకు గురైన మెయిన్‌రోడ్డుకు ఆగస్టు 15వ తేదీలోగా మరమ్మతులు పూర్తి చేస్తామని చోడవరం 9వ ఏడీజే కోర్టుకు ఆర్‌అండ్‌బీ అధికారులు లిఖితపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. బీఎన్ రోడ్డు, వడ్డాది–మాడుగుల రోడ్డులను బాగు చేయాలంటూ చోడవరం న్యాయవాదులు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా వేసిన పిటిషన్‌పై గురువారం వాదనలు జరిగాయి. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట, రోలుగుంట మీదుగా మెయిన్‌రోడ్డు (బీఎన్‌రోడ్డు), అనకాపల్లి–మాడుగుల ఆర్‌అండ్‌బీ రోడ్లు చాలా అధ్వానంగా గోతులు పడి ఉన్నాయని, వీటిని ఎందుకు బాగు చేయించలేదో తెలపాలంటూ గతేడాది జులైలో చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో చోడవరానికి చెందిన న్యాయవాదులు అన్నాబత్తుల భరత్ భూషణ్, భూపతిరాజు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు వాయిదాల్లో నోటీసులు అందుకున్న అధికారులు వచ్చి కోర్టు ముందు సమాధానం చెప్పగా తాజాగా ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రంగనాఽథ్ హాజరై రోడ్డుపై నివేదికను కోర్టుకు ఇచ్చారు. ఆగస్టు 15వతేదీ లోగా రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వమైన అఫిడవిడ్‌ను కోర్టుకు సమర్పించారని పిటిషనర్ తరపున న్యాయవాది, చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ విలేకరులకు వెల్లడించారు. ఈ రెండు రోడ్ల విషయమై ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిబంధనల ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని డేవిడ్ చెప్పారు.


