ముగిసిన గిరి ప్రదక్షిణ మహోత్సవం
జనసంద్రంగా మారిన
సింహగిరి
విశేషంగా
ఆలయ ప్రదక్షిణలు
సింహాచలం: శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని స్మరిస్తూ లక్షలాది మంది భక్తులు చేపట్టిన 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణ బుధవారం ముగిసింది. మంగళవారం తొలిపావంచా వద్ద ప్రారంభమైన ప్రదక్షిణను పూర్తి చేసిన భక్తులు తిరిగి అక్కడికే చేరుకుని కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సింహగిరికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
తెల్లవారుజామునే దర్శనాలు
గిరి ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చిన భక్తుల కోసం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేయలేదు. ఆ క్యూలను కూడా ఉచిత దర్శనానికి వినియోగించారు. నీలాద్రి గుమ్మం నుంచి లఘు దర్శనం కల్పించగా, అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు.
ఆలయ ప్రదక్షిణలకు స్పందన
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 2.40 గంటల నుంచే భక్తులను అనుమతించారు. ఆలయ బాహ్య ప్రాకారం చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణలు చేశారు.
జనసంద్రంగా మారిన సింహగిరి
గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు, ఆలయ ప్రదక్షిణల కోసం వచ్చిన భక్తులతో బుధవారం సింహగిరి జనసంద్రంగా మారింది. కొండదిగువ పాతగోశాల జంక్షన్ నుంచి అడవివరం వరకు, కొండపై ఆలయ పరిసరాల వరకు ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. తొలిపావంచా వద్ద మధ్యాహ్నం వరకు కొబ్బరికాయలు కొట్టేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతించారు. ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన కింద నుంచి దర్శనానికి పంపించి, దక్షిణ రాజగోపురం వైపు నుంచి బయటకు పంపించారు. నీలాద్రి గుమ్మం వద్ద నాలుగు ర్యాంపులు ఏర్పాటు చేసి దర్శనాలు వేగవంతం చేశారు. కొండపైకి, కొండదిగువకు దేవస్థానం 50 ఉచిత బస్సులను నడిపించింది. అన్నప్రసాద భవనంలో నిర్విరామంగా ప్రసాదాలను పంపిణీ చేయగా, అడవివరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించారు.
రద్దీతో భక్తులకు ఇబ్బందులు
భారీ రద్దీ కారణంగా కొండపై బస్టాండ్, పాతగోశాల జంక్షన్, తొలిపావంచా, ఘాట్‌రోడ్డులో రద్దీ నెలకొంది. తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టం వద్ద తమ బంధువులు కనిపించడం లేదంటూ సుమారు 500 ఫిర్యాదులు నమోదయ్యాయి. కొండపై నుంచి దిగువకు వచ్చే బస్సులను టోల్‌గేట్ వరకు మాత్రమే నడపడంతో అక్కడి నుంచి తొలిపావంచా వరకు భక్తులు నడిచి వెళ్లాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో కూడా బస్సులు అందుబాటులో లేక పలువురు వేపగుంట, గోపాలపట్నం వరకు కాలినడకన వెళ్లి బస్సులు ఎక్కాల్సి వచ్చింది.


