వార్నింగ్‌ సైరన్లు! | - | Sakshi
Sakshi News home page

వార్నింగ్‌ సైరన్లు!

Jul 18 2026 3:17 AM | Updated on Jul 18 2026 3:17 AM

నారుమడి... కంటతడి
ఇక ప్లాంట్‌ను నడపలేమంటూ పదేపదే యాజమాన్యం హెచ్చరికలు అప్పులు పుట్టడం లేదంటూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం రూ.3 వేల కోట్ల నష్టాల్లో ఉన్నప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంటున్న కార్మిక సంఘాలు ప్లాంట్‌కు రూ.77 కోట్ల నిధులున్న సమయంలో ఈ కుట్రలు ఏమిటని చర్చ దీని వెనుక ప్రైవేటీకరణ కుట్ర దాగి ఉందంటున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు

సాక్షి, విశాఖపట్నం: ‘సంస్థ నికర విలువ తగ్గిపోయింది. బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్పత్తి పెంచాలి.. ఖర్చులు తగ్గించాలి.. లేదంటే ప్లాంట్‌ని నడపలేం..!’ ఇటీవల పలు దఫాలు ఉద్యోగులతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ ప్రభాకర్‌ వ్యాఖ్యలివీ. మే నెలలో బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం 3 నెలల్లో ప్లాంట్‌ని లాభాల బాట పట్టిస్తానని చెప్పిన సీఎండీ నెల రోజులు గడవగానే 9 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఇక ఇప్పుడు అసలు ప్లాంట్‌ని నడపలేమని చేతులెత్తేసి వార్నింగ్‌ సైరన్లు మోగించటాన్ని బట్టి ప్రైవేటీకరణ కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రూ.3 వేల కోట్ల నష్టాల్లో ఉన్నప్పుడే ప్లాంట్‌ అద్భుతంగా నడిచినప్పుడు.. రూ.77 కోట్ల నిధులు ఉన్నప్పుడు ఎందుకు నడవదని ప్రశ్నిస్తున్నారు.

పకడ్బందీగా పావులు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్‌పరం చేసేందుకు తెరవెనుక భారీ కుట్రలు సాగుతున్నాయి. సంస్థ నికర విలువ తగ్గిపోయిందని, బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని భయపెడుతూ కార్మికులకు జీతాలు వస్తాయో రావోనంటూ ఆందోళనకు గురి చేస్తున్నారు. ఉక్కు శాఖ కార్యదర్శి స్థాయి అధికారి సందీప్‌ ఫౌండ్రిక్‌ విశాఖ వచ్చిన ప్రతిసారీ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్లాంట్‌లో మరింత గందరగోళం రేపుతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా అత్యంత పకడ్బందీగా పావులు కదుపుతున్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది.

ఉత్పత్తికి ఉద్దేశపూర్వకంగా గండి..!

స్టీల్‌ ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలపై యాజమాన్యం కనీస పెట్టుబడులు పెట్టకపోవడంతో ఉక్కు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు పూర్తి స్థాయిలో నడవాలంటే కోక్‌ ఓవెన్‌ నుంచి సుమారు 300 నుంచి 350 పుషింగ్స్‌ జరగాలి. కానీ ప్రస్తుతం పుషింగ్స్‌ సంఖ్య దారుణంగా 180కి పడిపోయింది. గతంలో రాంగ్‌ పుషింగ్స్‌ వల్ల బ్యాటరీలు దెబ్బతిని కోక్‌ ఓవెన్‌లోని బ్యాటరీ–3 పూర్తిగా మూతపడగా బ్యాటరీ–4 లో ఉత్పత్తి అత్యంత తక్కువగా నమోదవుతోంది. మిగిలిన వాటిలో కేవలం బ్యాటరీ–5 మాత్రమే కాస్త మెరుగ్గా పనిచేస్తోంది. కోక్‌ ఓవెన్‌ నుంచి వచ్చే గ్యాస్‌ కొరత కారణంగా రోలింగ్‌ ప్రక్రియ సాఫీగా జరగక ఆరు మిల్లులకు బదులు నాలుగు మిల్లులు మాత్రమే నడుపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ని పూర్తిగా నిలిపివేశారు.

అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్థిక నష్టాలు

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రెండు ఫర్నేస్‌లను మాత్రమే నడిపి కోక్‌ని ఆదా చేయాలని, మార్కెట్లో అత్యధిక డిమాండ్‌ ఉండే అక్టోబర్‌ నుంచి మార్చి వరకు మూడో ఫర్నేస్‌ నడపాలని కార్మిక సంఘాలు సూచించినా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. గత సీఎండీ అజిత్‌ సక్సేనా హయాంలో మంత్రుల ఒత్తిడికి తలొగ్గి... బయట మార్కెట్‌ నుంచి అధిక ధరకు ముడి పదార్థాలు, పెల్లెట్స్‌, కోక్‌ కొనుగోలు చేసి మూడో ఫర్నేస్‌ నడపడం వల్లే 2026 మార్చి నాటికి సంస్థ సుమారు రూ.1,800 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడం వల్ల గత జనవరి నుంచి ప్లాంట్‌లో సుమారు 25 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్లే ప్లాంట్‌ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. ప్రాణనష్టం కూడా భారీగా సంభవిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగులకు రూ.867 కోట్ల బకాయిలు

విశాఖ ఉక్కు రూ.930 కోట్ల నికర లాభాల్లో ఉన్నప్పుడే వంద ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు తలొగ్గుతోంది. ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ పోరాటాల ఫలితంగా రూ.11,440 కోట్ల నిధులు రాబట్టినా సమస్యలు మాత్రం తీరలేదు. సుమారు రూ.867 కోట్ల మేర ఉద్యోగుల జీతభత్యాలు, పీఎఫ్‌ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2026 మార్చి 23న ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి మరో రూ.8 వేల కోట్లు ఇస్తామని చెప్పినా నేటికీ నిధులు విడుదల కాలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించకుండా, సెయిల్‌లో విలీనం చేయకుండా యాజమాన్యానికి ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎండీ ప్రభాకర్‌ ఇంతవరకూ యూనియన్లతో సమావేశం నిర్వహించకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement