ప్రాణాలర్పించైనాఫణిగిరిని కాపాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలర్పించైనాఫణిగిరిని కాపాడుతాం

Jul 18 2026 3:17 AM | Updated on Jul 18 2026 3:17 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుబొడ్డేడ, సమన్వయకర్త ధర్మశ్రీ

ఫణిగిరిపై అక్రమ తవ్వకాలకు

వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్న బొడ్డేడ ప్రసాద్‌, కరణం ధర్మశ్రీ

అచ్యుతాపురంరూరల్‌ : ప్రాణాలర్పించైనా ఫణిగిరిని పరిరక్షించడంతో పాటు ప్రతిష్ట, పవిత్రను కాపాడతామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. రాంబిల్లి మండలం హరిపురం రెవెన్యూ పరిధి పంచదార్ల గ్రామంలో ఫణిగిరిపై అక్రమంగా సాగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ వెంకటాపురంలో వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ నాయకత్వంలో శుక్రవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ శ్రీలక్ష్మి నరసింహ మినరల్స్‌, రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో అడ్డుగోలుగా గ్రావెల్‌ను తవ్వేస్తుండడంతో పవిత్ర ఫణిగిరి ధ్వంసమవడంతో పాటు పుణ్య జలధారలకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. ఏడున్నర హెక్టార్లలో తవ్వకాలకు అనుమతులంటూ చెప్పి దానికి ఎన్నో రెట్లు విస్తీర్ణంలో అక్రమంగా అత్యంత లోతైన తవ్వకాలు నిర్వహిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని, పవిత్ర జలాలు కనుమరుగయ్యే విధంగా కొండను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. సనాతన ధర్మం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ఎన్‌డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫణిగిరిపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన పవిత్ర పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న ఫణిగిరి అక్రమ గ్రావెల్‌ తవ్వకాల వల్ల ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ, ప్రజా, బ్రాహ్మణ సంఘాలు, పర్యావరణ ప్రేమికులు అందరూ కలిసి కట్టుగా ఏకతాటిపైకి వచ్చి ఈ పవిత్ర క్షేత్ర పరిరక్షణ కోసం ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈ అక్రమ తవ్వకాలకు సహకరించిన స్థానిక తహసీల్దార్‌తో పాటు మైనింగ్‌ ఏడీ పై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుని, వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఫణిగిరి పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు. అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం, నాయకులు చేస్తున్న అరాచకాలు హద్దులు దాటాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జీవో రద్దు చేసి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకూ ఉద్యమాన్ని విరమించబోమని హెచ్చరించారు. అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్‌, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సుమారు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి, దాదాపు రూ.300 కోట్ల విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అక్రమ ధనార్జనే లక్ష్యంగా జిల్లా అధికారులతో కుమ్మకై ్క ఈ తవ్వకాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. శాస్త్రవేత్తలు సైతం పూర్తిగా అధ్యయనం చేయలేని పవిత్ర జలధారలను ధ్వంసం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం క్వారీ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. హరిపురం మాజీ సర్పంచ్‌లు దూళి అప్పారావు (బుజ్జి), దూళి సూర్య చంద్రరావు, వెంకటాపురం మాజీ సర్పంచ్‌ కిల్లాడ తాతబ్బాయి, వైఎస్సార్‌సీపీ వెంకటాపురం గ్రామ అధ్యక్షుడు సారిపల్లి పైడిరాజు, రాంబిల్లి మండల యూత్‌ అధ్యక్షుడు దూళి వెంకి, జెడ్పీటీసీ దూళి నాగరాజు, కొత్తపేట మాజీ సర్పంచ్‌ అరుణ లత రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ బోదెపు గోవింద్‌, రాంబిల్లి మండల అధ్యక్షుడు కిషోర్‌ రాజు, ఎంపీపీ శ్రీనుబాబు, అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, జెడ్పీటీసీ లాలం రాము, ఎంపిపి కోన సంధ్య లచ్చన్నాయుడు, మునగపాక అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement