● స్టీల్‌ప్లాంట్ సిబ్బంది నిర్వాకం
● ఆందోళనలో ప్రజలు
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ సిబ్బంది నిర్వాకంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్టీల్‌ప్లాంట్ కోసం కేటాయించిన భూముల్లో ఉన్న మామిడి, జీడితోటలను తొలగించే పనులు ప్రారంభించారు. ఇలా తొలగించిన చెట్లకు డి.ఎల్.పురంలో శుక్రవారం స్టీల్‌ప్లాంట్ సిబ్బంది నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగి చుట్టుపక్కల గ్రామాల సమీపంలో ఉన్న తోటలకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. చుట్టుపక్కల 80 ఎకరాల తోటలకు ఈ మంటలు విస్తరించాయి. ఉదయం ప్రారంభమైన మంటలు సాయంత్రం వరకు కొనసాగాయి. స్థానికుల్లో భయాందోళనలు నెలకొనడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే హెటెరో కంపెనీకి చెందిన ఫైర్‌ఇంజన్‌ను తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో నక్కపల్లి, అడ్డురోడ్డుల నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించి సాయంత్రానికి పరిస్థితిని కొంత చక్కదిద్దారు. అయినప్పటికీ అక్కడక్కడా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రికి ఇవి తీవ్రరూపం దాల్చవచ్చని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు ముందు జాగ్రత్తచర్యగా అగ్నిమాపకశకటాలను అందుబాటులో ఉంచారు.


