నూతన సంవత్సర వేళ విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతి
అచ్యుతాపురం రూరల్ : మునగపాక మండలం పల్లవాని వీధికి చెందిన మొల్లి రాము (25) కొండకర్ల కూడలికి సమీపంలో బస్సు బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం ఇంటి నుండి బయలుదేరి సోలార్ పరిశ్రమకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చే సరికి కార్మికులను తీసుకువెల్తున్న లారస్ పరిశ్రమ బస్సు, బైక్ డీకొన్న దుర్ఘటనలో మొల్లి రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంధ్రశేఖర్ రావు, ఎస్‌ఐ వెంకటరావు తెలిపారు. మృతుని కుటుంబాన్ని పరిశ్రమ, బస్సు యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్ చేసారు.
మునగపాకలో విషాదం
మునగపాక: కుటుంబానికి అందివస్తున్నాడనుకుంటున్న కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొందామని భావించిన ఆ యువకున్ని బస్సు మింగేసింది. దీంతో మునగపాకలో విషాదం అలముకుంది. వివరాలివి. మునగపాకకు చెందిన మొల్లి నాయుడు, వెంకటి దంపతులకు ఇద్దరు కుమారులు, నాయుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. నాయుడు పెద్దకుమారుడు రాము కొంతకాలంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అందరితో సఖ్యతగా ఉండే రాము బుధవారం మధ్యాహ్నం షిప్టునకు తన బైక్‌పై మునగపాక నుంచి బయలుదేరి వెళుతుండగా అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో ప్రధాన రహదారిపై బస్సు ఢీకొని అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయం అందరితో సరదాగా గడిపిన కొడుకు అర్ధంతరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
కొంపల్లి వద్ద బస్సును తప్పించబోయి...
దేవరాపల్లి : దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్డులో కుంపల్లి కూడలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కేఎంపాలెంకు చెందిన యువకుడు చౌడువాడ దేముడునాయుడు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన గంధం మహేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు కుంపల్లి కూడలి చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న దేముడునాయుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో బయటపడిన గంధం మహేష్‌ను కె.కోటపాడు సీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్‌కు తరలించారు. కాగా కేంపాలెంకు చెందిన సముద్రంనాయుడు, రమణమ్మ దంపతుల రెండో కుమారుడు దేముడునాయుడు ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రులతో పాటు అన్నయ్య జగ్గారావుకు వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేవాడు. స్నేహితుడితో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కె.ఎం.పాలెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దేముడునాయుడు మృతి పట్ల సర్పంచ్ గంధం రామకృష్ణ సంతాపం తెలిపారు.
నూతన సంవత్సర వేళ విషాదం
నూతన సంవత్సర వేళ విషాదం
నూతన సంవత్సర వేళ విషాదం


