అడ్డురోడ్డులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
ఎస్.రాయవరం: పాలనా వికేంద్రీకరణలో భాగంగా అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తిమ్మాపురం సచివాలయ భవనంలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఇన్‌చార్జ్ ఆర్డీవోగా నర్సీనట్నం ఆర్డీవో వి.వి.రమణకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన రెండు రోజుల్లో సర్పంచ్ కర్రి సత్యనారాయణ సచివాలయ భవనం కేటాయించడం అభినందనీయమన్నారు.తాత్కాలికంగా పనులు ప్రారంభించేందుకు సచివాలయ భవనం అనువుగా ఉందన్నారు. ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్‌లో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయన్నారు.త్వరలో మిట్టల్ స్టీల్ ప్లాండ్ మరో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కానుందని, అత్యంవేగంగా ఈ డివిజన్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పారు. పరిశ్రమలకు భూములు కేటాయింపులతో పాటు, భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆర్డీవో స్థాయి అధికారి అవసరం ఉందన్నారు. అనంతరం తిమ్మాపురంలో పలువురికి కలెక్టర్ పింఛన్ నగదు అందజేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు మాట్లాడారు.
గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలి
సోమిదేవ పల్లి గ్రామంలో సుమారు 10 ఏళ్లుగా మరమ్మతులకు గురై ప్రమాదకరంగా మారిన మూలపొలం గ్రోయిన్‌ను కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు.గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రమేష్‌బాబు, ఎంపీడీవో మీనా కుమారి, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ సచిదేవి, సర్పంచ్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అడ్డురోడ్డులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం


