ఎస్సీ, ఎసీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
తుమ్మపాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశాన్ని కలెక్టర్, ఎస్పీ తుహిన్ సిన్హా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు నిర్దేశించిన సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాయితీ రుణాలు సత్వరమే అందిస్తున్నట్టు తెలిపారు. వారికి మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు జిల్లాలో 34 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 31 కేసులకు సంబంధించి రూ.54.50 లక్షల పరిహారం మంజూరైందని చెప్పారు. త్వరలోనే మిగిలిన 3 కేసులకు సంబంధించి పరిహారం మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు బి.రామానందం, మంగవేణి, జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.మీనా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు, డీవీఎంసీ ఎన్‌జీవో కమిటీ సభ్యులు పలకా రవి, టి.జయశ్రీ, ఎం.రాజు, బి.అప్పారావు పాల్గొన్నారు.


