14 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలు ప్రారంభం
నాతవరం: జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, 14 మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయని జిల్లా క్రీడలు అధికారి పూజారి శైలజ తెలిపారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల ప్రకారం పోలీస్ మైత్రీ ఆటలు పోటీలు ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. కోటవురట్ల మండలంలో గ్రౌండ్ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు చేయలేదన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు చాలా కీలకమన్నారు. భారీ స్థాయిలో ఆటలు పోటీలు ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తున్న ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీవో శ్రీనివాస్, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి అపిరెడ్డి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.


