బాల భీముడు
ఎన్టీఆర్ ఆస్పత్రిలో జన్మించిన 4.8 కిలోల మగబిడ్డతో ఆస్పత్రి వైద్యులు
అనకాపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ముత్యాలమ్మ కాలనీకి చెందిన కోసురు రూపవతి అనే మహిళ సాధారణ కాన్పులో బాలభీముడికి జన్మనిచ్చింది. 4.8 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రూపవతికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాన్పు కష్టమవ ుతుందని భావించి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు జరిగింది. రూపవతికి 8వ నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో శిశువు బరువు 3 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ తప్పదేమోనని అనుకున్నారు. వుడ్స్ కార్క్ స్క్రూ ’ (మ్యాన్‌అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, సహజ ప్రసవం చేయగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, వైద్యురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.


